తెలంగాణ సీఎం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బలమైన వ్యూహాలు రూపొందించి అమల్లో పెట్టేస్తున్నారు. అందులో ముఖ్యమైనది రైతు బంధు పథకం. ఈ పథకం ఈనెల 10 నుంచి గులాబీ సర్కార్ ప్రతిష్ట్మాకం గా రైతులకు పంట పెట్టుబడి ని కొత్త పాస్ పుస్తకాలు అందిస్తుంది. దీనికోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను సర్కార్ ఇప్పటికే పూర్తి చేసేసింది. డీఎంకే అధినేత స్టాలిన్ వంటి వారిని ముఖ్య అతిధులుగా ఆహ్వానించింది. దాంతో బాటు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కేసీఆర్ రాజభవన్ కి వెళ్ళి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా గ్రామ స్థాయిలో రైతుబంధు పథకం అమలుకు వ్యవసాయశాఖ రెవెన్యూ శాఖలు సంయుక్తంగా పనిచేయనున్నాయి.
ఎలక్షన్ టార్గెట్ గానే స్కీమ్స్ ...
పనిచేసే ముఖ్యమంత్రి అని ప్రజలనుంచి అనిపించుకోవాలన్న లక్ష్యంతో కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ప్రజలకు నేరుగా ప్రయోజనం కల్పించే పనులను చేపట్టాలన్న ఆలోచనతో పనులతో ఓట్ల వర్షం రాలుతుంది అని టి బాస్ లెక్కలు వేస్తున్నారు. మిషన్ భగీరథ తో ఇంటి ఇంటికి తాగు నీరు, వ్యవసాయానికి సాగునీరు లక్ష్యంగా కేసీఆర్ దూసుకుపోతున్నారు. ఒక పక్క ప్రతిపక్ష కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తో పాటు తెలంగాణ ఉద్యమంలో తన సహచరుడు కోదండరాం సొంత పార్టీ పెట్టి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉండటంతో కేసీఆర్ దూకుడుగా వెళ్ళడానికే నిర్ణయించారు. తన ప్రత్యర్థులకు అందని ఎత్తులు రాజకీయంగా వేస్తూ పాలనా పరంగా కూడా జనంలో మార్కులు పడే కాన్సెప్ట్స్ లను ఆయన డిజైన్ చేస్తూ వెళుతున్నారు. దేశంలోనే ఎక్కడా లేని రీతిలో రైతు జనబాంధవుడు తానేనని చెప్పుకునే తీరులో కేసీఆర్ అమలు చేయనున్న ఈ పథకం అధికారపార్టీని వచ్చే ఎన్నికల్లో గట్టెక్కిస్తుందో లేదో చూడాలంటే ఏడాది ఆగాలి.