కేసీఆర్ ఇరుక్కుపోయారు

Update: 2018-06-22 00:30 GMT

టీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందన్న ప్రచారాన్ని తెలంగాణ కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీ పట్ల మెతక వైఖరిని అవలంబిస్తున్నారన్నది తెలంగాణ కాంగ్రెస్ వాదన. ముఖ్యంగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీపై కేంద్రం వెనకడుగు వేయడంతో దీనిని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. నీతి ఆయోగ్ సమావేశానికి ముందే కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి కీలక విషయాలను చర్చించకుండా రాజకీయ విషయాలనే ప్రస్తావించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

ప్రధాన విషయాలు పక్కనపెట్టి.....

ముస్లిం రిజర్వేషన్లు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వ్యవహారాలను పక్కనపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికపై ప్రధాని మోదీతో చర్చించారంటోంది కాంగ్రెస్. థర్డ్ ఫ్రంట్ పేరుతో నాటకానికి తెరతీసిన కేసీఆర్ మోడీ ఆదేశాల మేరకే నడచుకుంటున్నారంటోంది. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి స్వీయ రాజకీయ ప్రయోజనాలను కేసీఆర్ ఆశిస్తున్నారని అంటోంది. అనవసర విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, స్టీల్ ఫ్యాక్టరీ కాకుండా కొత్త సచివాలయం నిర్మాణంపైనే ముఖ్యమంత్రి దృష్టి పెట్టడమేంటని ప్రశ్నిస్తోంది. మోడీ చేతుల్లో కేసీఆర్ ఇరుక్కు పోయారని చెబుతోంది.

కేంద్రంతో లాలూచీ లేదు.....

ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర సమితి కూడా విభజన హామీల అమలుకోసం కేంద్రంపై వత్తిడి తెస్తున్నామని చెబుతోంది. గత పార్లమెంటు సమావేశాల్లో రిజర్వేషన్ల విషయంలో సభను స్థంభింపచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి కేంద్రం ముందుకు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే తప్పకుండా నిర్మించి తీరుతుందని మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలుచేస్తూనే విభజన హామీలపై కూడా పోరాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇలా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీని టార్గెట్ చేయని కేసీఆర్ ను ప్రజల్లో ఎండగట్టాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కన్పిస్తోంది.

Similar News