మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని కాంగ్రెస్ తంటాలు పడుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో సత్తా చాటి ఉత్తర భారతంలో బీజేపీని దెబ్బతీయాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా ఉంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఆ పార్టీకి కొత్త ఊపిరులు పోశాయి. దీంతో ఎలాగైనా మధ్యప్రదేశ్ ను తమ ఖాతాలో వేసుకోవాలని గ్రాండ్ ఓల్డ్ పార్టీ కసరత్తులు చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత.....
గుజరాత్ లో గట్టి పోటీ ఇచ్చి బీజేపీని మూడు చెరువుల నీళ్లు తాగించిన హస్తం పార్టీ మధ్యప్రదేశ్ లోనే అదే పంథాలో వెళ్లాలని భావిస్తున్నట్లుంది. జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో అప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వాన్ని కూడా ప్రారంభించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమవుతుందంటున్నారు. ముఖ్యంగా రైతు సమస్యలు, నిరుద్యోగం ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు పెట్టక తప్పవంటున్నారు. అందుకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలే ఉదాహరణగా పేర్కొంటున్నారు.
హార్థిక్ పటేల్ ప్రకటనతో.....
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పాటీదార్ల రిజర్వేషన్ల సమితి నేత హార్థిక పటేల్ మద్దతు ప్రకటించారు. పదిహేనేళ్ల పాటు పరిపాలించిన శివరాజ్ సింగ్ చౌహాన్ ను గద్దె దించాల్సిందేనన్నారు. అంతేకాదు ఆయన మరొక ఆసక్తి కరమైన వ్యాఖ్య కూడా చేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి జ్యోతిరాదిత్య సింథియా అంటూ ప్రకటించేశారు. జ్యోతిరాదిత్యకు తాము పూర్తిగా మద్దతిస్తామని హార్థిక్ పటేల్ ప్రకటించడం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. మొత్తంమీద హార్థిక్ ఈ ప్రకటనతో కాంగ్రెస్ లో అంతర్యుద్ధం బయలుదేరుతుందంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారని, అంతేతప్ప బయట వ్యక్తులు కాదని దిగ్విజయ్ సింగ్ అనుచరులు అంటున్నారు.