వైసీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతున్న సందర్భంలో ఇతర పార్టీల నుంచి నేతలు వరుస బెట్టి వైసీపీలో చేరుతుండటం ఆ పార్టీలో జోష్ ను పెంచుతోంది. జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ తో పాటు ప్రత్యేక హోదాపై పార్టీ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు కూడా నేతలను ఫ్యాన్ పార్టీ వైపు వచ్చేలా చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లాలో జగన్ పాదయాత్ర జరుగుతోంది. జగన్ పాదయాత్రకు గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలో మంచి స్పందన లభిస్తోంది.
జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే....
గుంటూరు జిల్లాలో పొన్నూరు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో జగన్ పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు వైసీపీలో చేరడం ఆ పార్టీకి ఊపుతెచ్చిందనే చెప్పాలి. తాజాగా మంగళగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ సమక్షంలో తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఉండవల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మూడు వేల మంది అనుచరులతో కలసి వచ్చి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రత్యేకహోదా సాధిస్తారనే నమ్మకంతోనే తాను వైసీపీలో చేరినట్లు సతీష్ చెప్పారు.
నేటి పాదయాత్ర షెడ్యూల్.....
వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర 135వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఉదయం ఉండవల్లి శివారు ప్రాంతం నుంచి జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి పట్టాభిరామయ్య కాలనీ, మహానాడు, సుందరయ్య నగర్ మీదుగా మణిపాల్ ఆసుపత్రి వరకూ యాత్ర కొనసాగనుంది. రాత్రికి జగన్ మణిపాల్ ఆసుపత్రి సమీపంలో బస చేయనున్నారు. బుధవారం జగన్ 11.3 కిలోమీటర్ల మేర నడిచారు. ఉండవల్లిలో జరిగిన భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో ఉన్నాయి.