సంచలన కేసుల్లో సిబిఐ జెడి గా వ్యవహరించి తరువాత తన పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి దిగిన లక్ష్మీనారాయణ రాజకీయ అరంగేట్రానికి మరికొంత సమయం వేచి ఉండాలి. తాజాగా గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న జెడి లక్ష్మీనారాయణ తన రాజకీయ ప్రవేశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఏపీలోని 13 జిల్లాల పర్యటన పూర్తి అయిన తరువాతే ఒక నిర్ణయానికి వస్తానని అప్పటివరకు ఏ పార్టీకి మద్దతు అని కానీ కొత్త పార్టీ కానీ ప్రకటించేది లేదన్నారు. ప్రస్తుతం యువత భవితకు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలించి డయాఫ్రామ్ వాల్ అద్భుతమని జెడి ప్రశంసించారు.
బిజెపి ఎమ్యెల్యే తో భేటీ ...
రాజమండ్రి శాసనసభ్యుడు బిజెపి ఎమ్యెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ తో జెడి లక్ష్మి నారాయణ భేటీ చర్చనీయాంశం అయ్యింది. తమ భేటీ సాధారణ విషయంగా వీరిద్దరూ ప్రస్తావించడం విశేషం. డాక్టర్ ఆకుల ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లినట్లు జెడి ప్రకటించారు కూడా. అయితే ఇద్దరు నేతల సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇటీవలే వైసిపి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మెన్ బుగ్గన రాజేంద్రనాధ్ ఢిల్లీ లో డాక్టర్ ఆకుల తో భేటీ కావడం ఆ తరువాత బుగ్గన ఆకుల బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ రామ్ మాధవ్ ను కలవడం తీవ్ర సంచలనమే అయ్యింది.
రాజమండ్రి వచ్చి.....
వైసిపి, టిడిపి ఎపి స్పీకర్ కు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకునే వరకు వ్యవహారం నడిచింది. తాజాగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజమండ్రి వచ్చిన జెడి బిజెపి ఎమ్మెల్యేతో సమావేశం ఆసక్తికరం. అయినా దీనిపై టిడిపి మీడియా పెద్దగా రాద్ధాంతం చేయకపోవడం విశేషం. మొత్తం మీద జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రావడం ఖాయమైనా ఆయన ఏ పార్టీకి మద్దతు తెలుపుతారన్నది ఆసక్తికరంగా మారింది.