ఈసారి పవన్ అంతా తానే అవుతారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక స్పష్టత ఇచ్చారు

Update: 2022-03-15 01:56 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక స్పష్టత ఇచ్చారు. జగన్ టార్గెట్ గా అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసే పనిని తాను తీసుకుంటానని చెప్పారు. అంటే అన్ని రాజకీయ పక్షాలతో కలసి వచ్చే ఎన్నికల్లో మహాకూటమిని ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. వైఎస్సార్సీపీ కి వ్యతిరేకంగా బీజేపీ, కమ్యునిస్టులు, టీడీపీని ఒకే వేదికపైకి తెచ్చేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారన్నది ఆయన మాటల్లో అర్ధమయింది.

వ్యతిరేక ఓటు...
ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలిపోకుండా చూసుకునే బాధ్యత తనది అని పవన్ కల్యాణ్ చెప్పారు. అంటే ఈసారి అంతా తానే అయి వ్యవహరిస్తారని పవన్ పరోక్షంగా చెప్పారు. ఇందుకోసం బీజేపీ రూట్ మ్యాప్ కోసం వేచి చూస్తున్నట్లు ఆయన చెప్పారు. బీజేపీ హైకమాండ్ తో పవన్ కల్యాణ్ ఇప్పటికే టచ్ లో ఉన్నట్లు అర్థమవుతుంది. టీడీపీని కలుపుకుని వెళ్లాలన్న తన అభిప్రాయాన్ని పార్టీ పెద్దల ముందు ఉంచినట్లు సమాచారం. అయితే అక్కడి నుంచి క్లియరెన్స్ రాగానే పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశముంది.
బీజేపీ కాదనలేని...
తెలుగుదేశం పార్టీతో పొత్తుపై బీజేపీ అంత సానుకూలంగా లేదు. చంద్రబాబును నమ్మి అనేకసార్లు మోసపోయిన విషయాన్ని వారు గుర్తు చేస్తుున్నారు. చంద్రబాబు ఫక్తు రాజకీయనాయకుడు. ఆయన అవసరార్థం పొత్తులు పెట్టుకుంటారని, పార్టీని ఎదగనివ్వరన్న అభిప్రాయం బీజేపీ పెద్దల్లో ఉంది. అయితే పవన్ ప్రెజర్ పెడితే బీజేపీ టీడీపీతో పొత్తుకు అంగీకరించే అవకాశాలు కూడా లేకపోలేదు. బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఏపీలో సాధించేదేమీ ఉండదు.
టూ సైడ్ లైవ్.....
ఇప్పటికే చంద్రబాబు జనసేనతో వన్ సైడ్ లవ్ ఉందని స్పష్టం చేశారు. అయితే పవన్ కల్యాణ్ నిన్నటి జనసేన ఆవిర్భావ సభలో మాత్రం వన్ సైడ్ కాదని టూ సైడ్ లవ్ ట్రాక్ నడుస్తుందన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈసారి ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు త్యాగాలకు సిద్ధపడాల్సి ఉంటుంది. పెద్ద సంఖ్యలో సీట్లను మిత్రపక్షాలకు ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై ప్రకటన చేయకపోయినా ఒక స్పష్టత మాత్రం ఇచ్చారు.



Tags:    

Similar News