వైసిపి అధినేత జగన్ పాదయాత్ర విజయవంతం చేయడానికి తూర్పు గోదావరి జిల్లా లో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. జూన్ రెండవ వారంలో జగన్ జిల్లాలోకి అడుగు పెట్టనున్నారు. ఆయనకు అఖండ స్వాగతం చెప్పేందుకు కార్యాచరణ ఆరంభించారు వైఎస్సాఆర్ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ల బృందం. 19 అసెంబ్లీ నియోజకవర్గాలతో మూడు పార్లమెంట్ సీట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాలో మెజారిటీ సాధించే వారే అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి టూర్ విజయవంతానికి అన్ని రకాల కృషి చేస్తున్నారు నాయకులు.
కృష్ణా బ్యారేజ్ కి మించి ....
వైసిపి అధినేత జగన్ పాదయాత్రలో కృష్ణా జిల్లాలో అడుగుపెట్టిన సన్నివేశం ఒక హైలెట్ గా నిలిచింది. ప్రకాశం బ్యారేజ్ మొత్తం జనసముద్రమై కదిలిన దృశ్యాలు మీడియా లో హోరెత్తాయి. అదే స్థాయిలో రాజమండ్రి రోడ్డుకం రైలు వంతెన పై కొవ్వూరు నుంచి 4.5 కిలోమీటర్ల పొడవైన ఆసియ లోనే రెండవ అతి పెద్ద రైలు రోడ్డు వంతెనపై పార్టీ శ్రేణులతో నిండిపోయేలా రికార్డ్ స్థాయిలో కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆ దృశ్యాలు డ్రోన్ కెమెరాల్లో బంధించే ఏర్పాట్లు చేస్తున్నారు.
వైఎస్ తరహాలో ...
గతంలో వైఎస్ మహా పాదయాత్ర సమయంలో రాజమండ్రి రోడ్డు కం రైలువంతెనపై నాటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన రావు భారీ ఏర్పాట్లు చేశారు. కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకు పడవలపై జెండాలు ధరించిన మత్సకారుల వైఎస్ కి అఖండ స్వాగతం పలికారు. ఆ తీరులోనే ఆయన తనయుడికి గోదావరి నడుమ ఘన స్వాగతం పలకాలని నిర్ణయించారు. కడియం నుంచి తెప్పించిన ప్రత్యేక పూలతో రోడ్డుకం వంతెన సర్వాంగ సుందరం చేయాలనే ఆలోచన చేస్తున్నారు. గతంలో వైఎస్ రోడ్డు కం రైలువంతెన దాటి రాజమండ్రి బహిరంగ సభలో పాల్గొని పాదయాత్ర చేస్తూ బూరుగుపూడి సమీపంలో వడదెబ్బకు పడిపోయారు. ఆయన పదిరోజుల తరువాత వైద్యుల చికిత్స అనంతరం అక్కడినుంచే లేచి పాదయాత్ర కొనసాగించి పూర్తి చేశారు. ఈసారి జగన్ పాదయాత్ర చేపట్టే సమయానికి ఎండలు పోయి చిరు జల్లులు పడి వాతావరణం మారిపోవడంతో పార్టీ శ్రేణులు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతికూల వాతావరణంలో ఎలా ఈ కార్యక్రమం పూర్తి చేయగలం అన్న ఆందోళన ఇప్పుడు వైసిపిలో తొలగిపోయింది.