ఢిల్లీలో పట్టు కోసం జగన్ స్కెచ్ ఇదే

Update: 2018-07-06 05:00 GMT

రానున్న ఎన్నికల్లో కేంద్రంలోనూ పట్టు సంపాదించడం మన టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం. 2019లో ఏ పార్టీకి కేంద్రంలో పూర్తి మెజారిటీ దక్కదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ప్రతి ఎంపీ సీటూ కీలకమే. ఏ పార్టీ అధికారం చేపట్టినా ప్రాంతీయ పార్టీల సీట్లు ఎంతో ముఖ్యం. రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలిచి కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా మారాలని భావిస్తున్నాయి టీడీపీ, వైసీపీ. ఇలా జరిగితే, అటు పార్టీలతో పాటు రాష్ట్రానికీ ప్రయోజనమే. దీంతో ఎమ్మెల్యే స్థానాల గెలుపుతో పాటు ఎంపీ స్థానాలను ఎక్కువ సంఖ్యలో గెలవడం అవసరం. అయితే, రానున్న ఎన్నికలకు ఇప్పటికే అన్నిరకాలుగా సిద్ధమవుతున్న జగన్...ఎంపీ స్థానాలను గెలుచుకునేందుకు ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా సీనియర్ నేతలుగా గుర్తింపు పొందిన వారిని ఎంపీలుగా పోటీ చేయించాలని భావిస్తున్నారు. దీని ద్వారా ఆయా వీరి ప్రభావంతో ఎంపీ స్థానాల పరిధిలోని ఎమ్మెల్యే స్థానాల గెలుపూ సులభం అవుతుంది. దీనికితోడు ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం కలుగుతుంది.

ఢిల్లీ వెళ్లేది వీరేనా...

ప్రస్తుతం ఎంపీ రేసులో మాజీ మంత్రులు ధర్మాన ప్ర‌సాద‌రావు, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌తో పాటు బాలినేని పేర్లు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నిక‌లు వైఎస్సార్ సీపీకి ఎంతో కీల‌క‌మైన‌వి. అందుకే ఈసారి ఎలాగైనా పార్టీని గెలిపించేందుకు జ‌గ‌న్ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. పాద‌యాత్ర ద్వారా పార్టీకి మైలేజ్ పెంచ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యారు. జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర త‌ర్వాత ఎంతైనా ఆ పార్టీకి జ‌నాల్లో ఆద‌ర‌ణ పెరిగింద‌నేది మాత్రం వాస్త‌వం. వైఎస్ హ‌యాంలో మంత్రులుగా ప‌నిచేసిన బొత్స‌, ధ‌ర్మాన, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ వంటి వారిని ఈసారి ఢిల్లీకి పంపించే యోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్నార‌ట‌. వీరితో పాటు బాలినేని పేరు కూడా వినిపిస్తోంది. వైసీపీని గెలిపించి రాష్ట్ర రాజ‌కీయాల్లో మ‌ళ్లీ త‌మ హ‌వాను కొన‌సాగించాల‌ని వీరు ఆశ‌ప‌డ్డా జగ‌న్ నిర్ణ‌యంతో వీరంతా ఎంపీ స్థానాలపై కూడా దృష్టి పెడుతున్నారట.

రాజమండ్రి స్థానాన్ని కన్ఫర్మ్ చేసినట్లేనా...

తూర్పుగోదావ‌రి జిల్లా రామ‌చంద్ర‌పురానికి చెందిన పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌ను ఈసారి రాజ‌మండ్రి నుంచి బ‌రిలోకి దింపాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. ఇక శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఉన్న ఒక్కొక్క ఎంపీ స్థానం నుంచి ధ‌ర్మాన‌, బొత్స‌ను పోటీకి దించే యోచ‌న‌లో ఉన్నార‌ట‌. వీరికి జిల్లా రాజకీయాల‌పై ప‌ట్టు ఉండ‌టంతో పాటు ఆయా వ‌ర్గాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల‌ర‌నేది అధినేత ఆలోచ‌న‌. వీరిని నిల‌బెట్టడం వ‌ల్ల పార్టీ ఎమ్మెల్యేలు సులువుగా గెల‌వ‌డంతో పాటు.. ఢిల్లీ స్థాయిలో ప‌ర‌ప‌తి పెరుగుతుంద‌ని సూచిస్తున్నార‌ట‌.

జగన్ చెప్పినందునే...

వాస్త‌వంగా చూస్తే పిల్లి బోస్‌కు రామ‌చంద్రాపురం నుంచే అసెంబ్లీకి పోటీ చేయాల‌న్న కోరిక ఉంది. అయితే ఆయన సామాజికవర్గానికే చెందిన జ‌డ్పీ మాజీ చైర్మ‌న్ చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌ను అక్కడ రంగంలోకి దించుతున్నారు. బోస్‌ను రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేయిస్తున్నారు. ఇక ప‌దేళ్ల కాంగ్రెస్ పాల‌న‌లో విజ‌య‌న‌గ‌రం జిల్లాను బొత్స‌, శ్రీకాకుళం జిల్లాను ధ‌ర్మాన ఓ రేంజ్‌లో ఏలేశారు. ఇప్పుడు మ‌ళ్లీ వారు అసెంబ్లీకి పోటీకి రెడీ అవుతున్నారు. అయితే జ‌గ‌న్ మాత్రం మీరు ఎంపీలుగా వెళ్లాలని సూచిస్తున్నారంట. మీరు ఎంపీలుగా పోటీ చేస్తే మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు మ‌నం గెలుచుకోవ‌చ్చ‌ని వారికి నచ్చజెపుతున్నార‌ట‌. ఇక ప్ర‌కాశం జిల్లాలో బాలినేని ఒంగోలు నుంచి అసెంబ్లీకి పోటీ చేయ‌న‌ని చెప్పడంతో జగన్ ఎంపీకి పోటీ చేయించేందుకు ఆఫర్ ఇచ్చారంట. మొత్తానికి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి అధికారంలోకి వస్తే రాష్ట్ర క్యాబినెట్ లోకి చేరాలను కొందరు సీనియర్లు ఆశిస్తున్నా, జగన్ సూచనతో వారు పార్టీ కోసం పార్లమెంటు స్థానాలపై దృష్టి పెట్టారని తెలుస్తోంది.

Similar News