జగన్ గమ్యానికి చేరువవుతూ వస్తున్నారు. ప్రస్తుతం 1800 కిలోమీటర్ల పాదయాత్రకు జగన్ చేరుకున్నారు. మరో 1200 కిలోమీటర్ల దూరమే పాదయాత్ర మిగిలి ఉంది. గత ఏడాది నవంబర్ 6వ తేదీన జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రను కడప జిల్లాలోని ఇడుపుల పాయ నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఏడు జిల్లాల్లో జగన్ పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకున్న జగన్ ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. మొత్తం మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రను జగన్ పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం 1800కిలోమీటర్లు పూర్తి చేశారు. మరో ఐదు జిల్లాల్లో జగన్ పర్యటించాల్సి ఉంది.
బంధువులతో కాసేపు......
కృష్ణా జిల్లా లోని గణపవరం గ్రామంలో జగన్ పాదయాత్ర 1800 కిలోమీటర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మొక్కనాటారు. ప్రతి వంద నియోజకవర్గాలకు జగన్ మొక్క నాటుతూ వస్తున్న సంగతి తెలిసిందే. గణపవరం గ్రామంలో జగన్ దగ్గర బంధువులున్నారు. ఆయన మేనమామ కుమార కోటిరెడ్డి ఇంటికి వెళ్లి బంధువులతో జగన్ కాసేపు ముచ్చటించారు. జగన్ చాలా రోజుల తర్వాత తమ ఇంటికి రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
నేడు హైదరాబాద్ కు జగన్......
మైలవరం నియోజకవర్గంలో పాదయాత్ర ముగిసింది. ప్రస్తుతం నూజివీడు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర ప్రవేశించింది. నూజివీడులో వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు జగన్ కు ఘన స్వాగతం పలికారు. జగన్ పాదయాత్ర 140వ రోజుకు చేరుకుంది. ఈరోజు జగన్ బస చేసిన శోభనాపురం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించి ఈదర మీదుగా కొత్త ఈదర వరకూ యాత్ర కొనసాగనుంది. అనంతరం జగన్ అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు. రేపు శుక్రవారం కావడంతో జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అందుకే ఆయన ఈ సాయంత్రం నేరుగా హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు.