హోదాను వదలను...అన్న మాట తప్పను

Update: 2018-04-08 01:30 GMT

ప్రత్యేక హోదా మీద తన మాట నాలుగేళ్ల నుంచీ ఒక్కటేనని, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే తరచూ మాట మారుస్తున్నారని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. తెనాలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తాము అన్నమాట ప్రకారమే పార్టీ పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేశారన్నారు. ఆమరణ దీక్షకు దిగారన్నారు. కాని తెలుగుదేశం పార్టీ మాత్రం అఖిలపక్షం పేరుతో ఇంకా హోదా రాకుండా అడ్డుకునే కార్యక్రమాలను చేపట్టిందన్నారు.

చంద్రబాబు కలసి రాకపోవడంతో.....

ఇవే ఆఖరి బడ్జెట్ సమావేశాలు కావడంతోనే తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేశారన్నారు. చంద్రబాబు కూడా కలసి వచ్చి రాజీనామాలు చేసి ఉంటే కేంద్రం దిగి వచ్చేదన్నారు. జాతీయ స్థాయిలో చర్చ జరిగి కేంద్రం ఇరకాటంలో పడేదన్నారు. చంద్రబాబు హోదా దక్కకూడదన్న ఏకైక కారణంతోనే సైకిల్ ర్యాలీలు, నల్ల బ్యాడ్జీలతో కాలక్షేపం చేస్తున్నారన్నారు. చంద్రబాబు కలసి రాకున్నా, తాను ప్రత్యేక హోదా సాధించేంత వరకూ పోరాడతానని జగన్ స్పష్టం చేశారు.

నేడు ఢిల్లీకి విజయమ్మ.....

ఇదిలా ఉండగా వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఐదుగురు ఎంపీల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఎంపీల దీక్ష మూడో రోజుకు చేరుకుంది. జగన్ పాదయాత్రలో ఉండటంతో ఎంపీల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వారిని చూసేందుకు వైఎస్ జగన్ తల్లి విజయమ్మ ఈరోపు ఢిల్లీకి రానున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మేకపాటిని కూడా విజయమ్మ పరామర్శించనున్నారు.

1700 కి.మీ దాటిన జగన్....

వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర మరో మైలురాయిని చేరుకుంది. జగన్ ప్రస్తుతం 1700 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. మొత్తం మూడు వేల కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేయాల్సిన జగన్ ఇప్పటికే 1700 కిలోమీటర్లను పూర్తి చేశారు. గుంటూరు జిల్లాలోని తెనాలి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ వద్ద జగన్ పాదయాత్ర 1700కిలోమీటర్లను దాటేసింది. ఈ సందర్భంగా అక్కడ జగన్ మొక్కను నాటారు. మరో 1300 కిలోమీటర్లు జగన్ పాదయాత్రను చేయాల్సి ఉంది.

Similar News