22న తేల్చేస్తానన్న జగన్

Update: 2018-04-19 05:30 GMT

ఈనెల 22వ తేదీన వైసీపీ అధినేత జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాజీనామాలు చేసిన పార్లమెంటు సభ్యులతో కృష్ణా జిల్లాలో సమావేశమైన జగన్ పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష ఈ నెల20వ తేదీ పూర్తి కానుండటంతో 22వ తేదీన ప్రత్యేక హోదా కోసం మరో నిర్ణయం తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. బహుశ ఎమ్మెల్యేల రాజీనామాల అంశంమే ఇందులో ప్రధానంగా ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది.

టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే.....

ఎంపీలతో సమావేశమైన జగన్ చంద్రబాబు దీక్ష దొంగ దీక్ష అని తేల్చారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా వారితో కలసి నడవడానికి టీడీపీ ప్రయత్నించకపోవడాన్ని జగన్ తప్పు పట్టారు. అందరూ కలిసి రాజీనామాలు చేస్తే ప్రభుత్వం దిగి వచ్చేదని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు చేసిన పోరాటాన్ని ఆయన అభినందించారు. భవిష్యత్ కార్యాచరణను ఈ నెల 22వ తేదీన నిర్ణయిస్తానని జగన్ వారితో చెప్పినట్లు తెలిసింది.

వన్ డే ఫార్ములా.....

ఇక చంద్రబాబు ప్రత్యేక హోదాపై నాటకాలాడుతున్నారని, దీక్ష పేరుతో సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నం చేస్తున్నారని జగన్ అన్నారు. ఇటీవల జరిగిన బంద్ లో ఆందోళనకారులపై కేసులు పెట్టడాన్ని జగన్ తప్పు పట్టారు. బంద్ కు పరోక్షంగా మద్దతిస్తామని చెబుతూనే చంద్రబాబు కేసులు పెట్టడమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జగన్ పార్టీ శ్రేణులను కోరారు. చంద్రబాబుది అంతా వన్ డే ఫార్ములా అని దుయ్య బట్టారు. ఎన్ని దీక్షలు చేసినా చంద్రబాబును ప్రజలు నమ్మరని జగన్ ఎంపీలతో అన్నారు.

Similar News