Summer Effect : ఎండలు మామూలుగా ఉండవు..అగ్నిమాపక అధికారుల సూచనలివే
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. సాధారణంకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి
ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుంది. వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా భయపెడుతున్నాయి. రెండు రోజులు పాటు తెలంగాణ లో చిరుజల్లులు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో మరింత ఆందోళన పెరిగింది. ఎందుకంటే వర్షం కురిసిందన్న ఆనందం కన్నా ఆ తర్వాత ఎండల తీవ్రత ఎంత తీవ్రంగా ఉంటుందన్న భయమే నిద్రపోనివ్వడం లేదు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలకు చేరువయ్యాయి. హైదరాబాద్ వంటి నగరంలోనూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉక్కపోతతో పాటు గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో బుధవారం 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెబుతున్నారు.
ఎనిమిది దాటితే చాలు...
ఉదయం ఎనిమిది గంటలు దాటిందంటే రోడ్డు మీదకు రావాలంటే భయపడిపోతున్నారు. ఆలయాలు, షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు, జ్యుయలరీ షాపులు ఇలా ఒకటేమిటి అన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. అంత అవసరమైతే రాత్రి వేళ షాపింగ్ కు, దైవ దర్శనానికి వెళ్లాలని భావిస్తున్నారు. మరొక వైపు కరెంట్ కోతలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఇంట్లో ఉండి సేదతీరుదాం అనుకున్న వాళ్లు కూడా చెమటతో ఇబ్బంది పడుతున్నారు. ఉక్కపోతతో ఇంట్లో ఉండలేక, ఎండవేడిమికి బయటకు వెళ్లలేక సతమతమవతున్నారు.
ఫైర్ డిపార్ట్ మెంట్ సూచనలివే...
మరో వైపు ఇప్పటికే అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు నిప్పు రవ్వ పడితే చాలు మాడి మసైపోతున్నాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది కూడా ఏ సమయంలోనైనా కాల్ వస్తుందని భావించి అప్రమత్తతో ఉంటున్నారు.హైదరాబాద్ లోనే వరసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎండాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక సిబ్బంది సూచిస్తున్నారు. ఏసీలు సర్వీసింగ్ చేయించుకోకుండా వినియోగించవద్దని చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ తో నూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రిఫ్రిజిరేటర్, ఏసీ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు ఖచ్చితంగా ఇన్వెర్టర్లను వినియోగించాలని చెబుతున్నారు. ఇలా అనేక రకాలుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.