Sun Effect : ఆరెంజ్ అలెర్ట్.. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని వార్నింగ్
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధిక ఉష్ణోగ్రతలకు తోడు వేసవి గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకే జంకు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఒక్కసారిగా భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. వాతావరణ శాఖ అధికారులు అనేక ప్రాంతాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
డీహైడ్రేషన్ కు లోను కాకుండా...
ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ అయిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. అత్యవసర పనులుంటే ఉదయం, సాయంత్ర వేళల్లో మాత్రమే చూసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగులు, వయోవృద్ధులు, చిన్నారులు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండటం మేలని సూచిస్తున్నారు. శరీరం డీ హైడ్రేషన్ కు గురి కాకుండా రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు తాగాలని వైద్యులు చెబుతున్నారు.
నలభై డిగ్రీలు దాటి...
వాతావరణ శాఖ అధికారుల అలెర్ట్ ప్రకారం ఇప్పటికే పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా దోర్నాలలో అత్యధికంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్కాపురం మండలం తిమ్మాయపాలెంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. సాధారణ ఉష్ణోగ్రతలు కుంటే నాలుగు నుంచి ఐదు డీగ్రీల ఉష్ణోగ్రతలు రానున్న రెండ మూడు రోజుల్లో నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.