ఏపీ విభజన తరువాత గిల గిలా రెండు రాష్ట్రాల్లో కొట్టుకుంటున్న కాంగ్రెస్ కి ఊపిరి పోశారు నరేంద్ర మోడీ, చంద్రబాబు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, కాపు రిజర్వేషన్ల అమలు అంశాలు ఇప్పుడు కాంగ్రెస్ కి ఏపీలో కాలు మోపే అవకాశాన్ని కల్పించాయి. ఈ రెండు అంశాలతో ప్రజల్లోకి దూసుకుపోవచ్చని ఎంతోకొంత గత ఎన్నికల కన్నా ఓటు బ్యాంక్ మెరుగు పరుచుకోవచ్చన్న వ్యూహాన్ని కాంగ్రెస్ సీనియర్లు ఆలోచన చేస్తున్నారు. గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలు ఈ అంశాన్నే స్పష్టం గా చెబుతున్నాయి. ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాష్ట్ర ఇంచార్జ్ ఉమెన్ చాందీ లు చేస్తున్న వ్యాఖ్యలు కూడా దీన్ని బలపరుస్తున్నాయి.
కాంగ్రెస్ మాత్రమే చేయగలదు....
‘‘ప్రత్యేక హోదా, విభజన హామీలు, కాపు రిజర్వేషన్ల అంశాలు జాతీయ స్థాయిలో జరగాలిసినవి. జాతీయ పార్టీ మాత్రమే వాటిని నెరవేర్చగలదు. చేస్తే కాంగ్రెస్ చేయాలి లేదా బిజెపి నెరవేర్చాలి. బిజెపి ఈ అంశంలో ఫెయిల్ అయ్యింది. ఇక మిగిలింది కాంగ్రెస్ మాత్రమే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వీటిని అమలు చేసి తీరతాం’’ అన్న హామీతో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ వార్ రూమ్ డిసైడ్ చేసేసింది. రాహుల్ గాంధీ అవసరమైతే దీనిపై లిఖితపూర్వక హామీని ఎపి ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని రఘువీరా సైతం గతంలోనే ప్రకటించారు.
జగన్ వ్యాఖ్యలతో ...
మరోవైపు వైసిపి అధినేత జగన్ కాపు రిజర్వేషన్లు జాతీయ స్థాయిలోని అంశం అని ప్రకటించి కాంగ్రెస్ కి మరో ఆయుధం అందించారు. ఇందులో ప్రాంతీయ పార్టీలుగా తాము చేసేది లేదన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లడం కాంగ్రెస్ కి కలిసొచ్చే అంశం. ఇలా పాతాళంలోకి పడిపోయిన కాంగ్రెస్ గ్రాఫ్ ను అన్ని పార్టీలు అనుకోకుండా సాయం చేసి పైకి లేపుతున్న పరిస్థితే కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ కీలక అంశాలపై రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.