ఒక సీటు తెచ్చిన తంటా....!

Update: 2018-05-31 13:30 GMT

ఈరోజు జరిగిన ఉప ఎన్నికలు ఒక రాష్ట్ర అధికార పీఠాన్ని మార్చే స్థితికి తీసుకు వచ్చాయి. కర్ణాటక పుణ్యమా అని ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మేఘాలయలో అంపతి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మియని డి షిరా గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మేఘాలయలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కర్ణాటక గవర్నర్ అతిపెద్ద పార్టీ అయిన బీజేపీనే తొలుత ఆహ్వానించిన సంగతిని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.

కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా.....

మేఘాలయలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలుండగా కాంగ్రెస్ పార్టీ గతఎన్నికల్లో 21 స్థానాల్లో గెలిచింది. కానీ మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా రెండు చోట్ల పోటీ చేయడంతో ఒకస్థానానికి రాజీనామా చేయాల్సి రావడంతో అపంతి నియోజకవర్గానికి ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో ముకుల్ సంగ్మా తన కుమార్తెనే బరిలోకి దింపి గెలిపించుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కు 21 స్థానాలు, నేషనల్ పీపుల్స్ పార్టీకి 20 స్థానాలు, యూడీపీకి ఆరు, బీజేపీకి రెండు, పీడీఎఫ్ పార్టీకి నాలుగు, స్వతంత్రులు ముగ్గురు గెలిచారు. మిగిలిన నాలుగు స్థానాల్లో ఇతరులు గెలుపొందారు.

మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టడానికే.....

కాని ఎన్నికల తర్వాత నేషనల్ పీపుల్స్ పార్టీతో ఇతర పార్టీలు కలవడంతో గవర్నర్ వారినే ఆహ్వానించారు. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేదు. అయినా కర్ణాటకను ఉదాహరణగా చూపి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని పట్టుబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాని ఇది సాధ్యం కాని పని అని కొందరు నేతలు బహిరంగంగానే చెబుతున్నా.... మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకే గవర్నర్ ను కలవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ ప్రభుత్వం ఏర్పాటవ్వడం, కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోకపోవడం వంటివి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతికూల అంశాలే. అయినా కర్ణాటక అంశాన్ని దేశ వ్యాప్తంగా మరోసారి చర్చించుకునేలా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. మరి ఏంజరుగుతుందో చూడాలి.

Similar News