ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరువు కోసం పాకులాడుతోంది. 2014 ఎన్నికల్లో జిల్లాలోని ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది. జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వీటిల్లో ఎక్కడ కూడా హస్తం హవా కొనసాగలేదు. గులాబీ పార్టీకి పోటీ ఇవ్వలేకపోయింది. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎలాగైనా తమ సత్తాచాటాలని కాంగ్రెస్ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అదంత సులువుకాదని పలువురు నాయకులు అంటున్నారు. ఈ జిల్లాలో సెటిలర్లే కీలకంగా వ్యహరిస్తున్నారు. గతంలో గులాబీకి జైకొట్టిన వీరు ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
టిక్కెట్ల విషయంలోనే.....
ఆర్మూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే ఎమ్మెల్సీ ఆకుల లలిత కూడా టికెట్ ఆశిస్తున్నారు. బాన్సువాడలో కాసుల బాలరాజు, మల్యాద్రిరెడ్డి కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్నారు. ఇక బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి బరిలోకి దిగడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కోసం గంగారాం, అరుణతార పోటీపడుతున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నల్లమడుగు సురేందర్‌రెడ్డి, ఇటీవలే పార్టీలో చేరిన సుభాష్‌రెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరికి టికెట్ వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
డీఎస్ చేరితే......
అలాగే.. బాల్కొండ నియోజకవర్గంలో ప్రభుత్వ మాజీ విప్ అనిల్ మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇక్కడి నుంచి కేఆర్ సురేశ్‌రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. కామారెడ్డిలో కాంగ్రెస్ నుంచి మరోసారి షబ్బీర్ అలీ పోటీ చేయనున్నారు. ఇక నిజామాబాద్ అర్బన్ సీటు కోసం కాంగ్రెస్ పార్టీలో పోటీ తీవ్రంగానే ఉంది. మహేశ్‌కుమార్, రత్నాకర్, ఎమ్మెల్సీ ఆకుల లలిత పేర్లు వినినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన డీఎస్ మళ్లీ సొంతగూటికి వస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్‌నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమే. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ తన పట్టును ఇక్కడ నిలుపుకుంటుందా? అన్నది ప్రశ్నార్థకమే.