Weather Report : ప్రిపేర్ అయిపోండి.. చలి కాదు.. ముందుంది వేసవి ఎండ
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. జనవరి నెల వెళ్లిపోతున్నా చలి మాత్రం తగ్గడం లేదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. జనవరి నెల వెళ్లిపోతున్నా చలి మాత్రం తగ్గడం లేదు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు లేవు. జనవరి రెండో వారం నుంచి చలి తీవ్రత క్రమంగా తగ్గే పరిస్థితులు ఉండేవి. కానీ నేడు రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పది గంటల వరకూ చలి తీవ్రత తగ్గడం లేదు. సాయంత్రం ఐదు గంటల నుంచి చలి మొదలవుతుంది. ఈఏడాది చలి ఎంత ఎక్కువగా ఉంటుందో వెండి కూడా అంతే ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ప్రిపేర్ అయిపోవాలని ముందుగానే ప్రజలనుహెచ్చరిస్తున్నారు.
కనిష్ట ఉష్ణోగ్రతలు...
తెలంగాణలో చలితీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అనేకరకాలుగా ఇబ్బందులుపడుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారు. జ్వరం, ఒళ్లునొప్పులు, దగ్గు వంటి ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. శ్వాసకోశఇబ్బందులన్న వారు బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. మెదక్‌లో కనిష్ఠంగా 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్ 13.2, రాజేంద్రనగర్‌లో 13.5 డిగ్రీలు, పటాన్‌చెరు 13.4, హకీంపేట 13.6, దుండిగల్‌లో 16, మహబూబ్‌నగర్‌లో 19.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయింది. దీర్ఘకాలిక రోగులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
పొగమంచు కూడా తీవ్రమై...
మరోవైపు పొగమంచు కూడా తీవ్ర ఇబ్బందులు పెడుతుంది. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో పొగమంచు వల్ల వాహనాల రాకపోకలు ఆలస్యంగా మారుతున్నాయి. ఒకవైపు చలిగాలులు, మరొక వైపు పొగమంచు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. జాతీయరహదారిపై దారి కనిపించక వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. విజయవాడ, శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాలు పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్నాయి. హెడ్ లైట్లు వేసుకుని మరీ ప్రయాణం చేయాల్సి వస్తుంది. విజయవాడ ఎయిర్ పోర్టులో పొగమంచు కారణంగా ఇండిగో విమానం కాసేపు గాలిలో చక్కర్లు కొట్టింది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.