లెజెండ్ కు లైన్ క్లియర్.. హ్యాట్రిక్ విక్టరీ ఖాయం

హిందూపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భివించిన తర్వాత అక్కడ వేరే పార్టీ గెలిచిన దాఖలాలు లేవు

Update: 2022-06-27 05:31 GMT

హిందూపురం నియోజకవర్గం అంటే టీడీపీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భివించిన తర్వాత అక్కడ వేరే పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. వన్ సైడ్ విజయం టీడీపీదే. అది ఎన్టీ రామారావు అయినా సరే.. వేరే అభ్యర్థి అయినా సరే. సైకిల్ పార్టీ ఈ నియోజకవర్గంలో గెలిచినంత ఎక్కడా గెలవలేదనే చెప్పాలి. కుప్పంలోనూ చంద్రబాబు ఏడుసార్లు మాత్రమే గెలిచారు. కానీ హిందూపురంలో టీడీపీ అభ్యర్థులు తొమ్మిది సార్లు విజయం సాధించారు. ఇక్కడ టీడీపీని ఓడించే మొనగాడు ఇప్పటి వరకూ పుట్టలేదనే చెప్పాలి.

తొమిది దఫాల నుంచి...
గత ఎన్నికల్లో వైఎస్ జగన్ పార్టీ ప్రభంజనమే సృష్టించింది. అనంతపురం ఉమ్మడి జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలవగా అందులో హిందూపురం ఒకటి. నందమూరి తారకరామారావు ఇక్కడ హ్యాట్రిక్ విజయాలను సాధించారు. 1985, 1989, 1994లో ఎన్టీఆర్ ఇక్కడ గెలిచారు. ఇక ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ 1996లో గెలిచారు. రాష్ట్రమంతా టీడీపీకి వ్యతిరేక పవనాలు వీచినా హిందూపురం గడ్డ మాత్రం సైకిల్ పార్టీని ఆదరించింది. ఇక నందమూరి బాలకృష్ణ సయితం 2014, 2019 ఎన్నికల్లో వరసగా విజయం సాధించారు.
రోడ్డున పడి....
హిందూపురం కర్ణాటకను ఆనుకుని ఉంటుంది. ఇక్కడ ముస్లిం సామాజికవర్గం ఎక్కువ. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ ను పోటీ చేయించి ప్రయోగం చేసింది. అయినా ఫలితం లేదు. ఆయనను ఎమ్మెల్సీగా చేసి వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ గెలిచి టీడీపీ అడ్డాలో జెండా పాతాలని జగన్ భావించారు. అక్కడ మరో నేత నవీన్ నిశ్చల్ కు కూడా నామినేటెడ్ పదవి అప్పగించారు. కానీ గ్రూపుల విభేదాలతో పార్టీ నడి రోడ్డున పడింది. రోడ్డున పడి కొట్టుకుంటున్నారు. వీధిల్లోకి ఎక్కుతున్న హిందూపురం వైసీపీని చూసి జాలిపడాల్సిందే తప్ప ఆ పార్టీ అభిమానులు ఏం చేయలేని పరిస్థిితి.
మూడు గ్రూపులుగా...
హిందూపురంలో నవీన్ నిశ్చల్, మహ్మద్ ఇక్బాల్ లు రెండు వర్గాలుగా ఉన్నారు. మరో నేత కొండూరు వేణుగోపాల్ రెడ్డిది మూడో వర్గంగా చెప్పుకోవాలి. ఇటీవల రెండు వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. రాళ్లదాడులు కూడా చేసుకున్నారు. పార్టీ అధినాయకత్వం ఎంత నచ్చ చెప్పినా ఫలితం ఉండక పోవచ్చు. ఒక వర్గం మరొక వర్గానికి సహకరించే అవకాశం ఉండదు. దీంతో బాలయ్య బాబు హ్యాట్రిక్ విజయం ఖాయమని చెప్పక తప్పదు. అధికారంలో ఉండగా గ్రూపులు సహజమే అయినా.. పట్టు అసలే లేని చోట కొట్టుకు చస్తున్నారంటే ఇక్కడ వైసీపీని ఎవరూ బాగుచేయలేరన్నది వాస్తవం.


Tags:    

Similar News