హర్షకుమార్... తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఎంపీగా అందరికీ తెలిసిన నాయకుడు. రాష్ట్ర విభజన సమయంలో తీవ్రంగా వ్యతిరేకించిన ఎస్సీ వర్గానికి చెందిన నాయకుడు. అమలాపురం నుంచి 2004, 2009లలో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన జీవీ హర్షకుమార్‌కి కాంగ్రెస్‌లో కీలక నాయకులతో మంచి సంబంధాలు ఉండేవి. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్ తో పాటు అప్పటి కాంగ్రెస్ ఉద్దండులతో సన్నిహిత సంబంధాలు నెరిపే హర్షకుమార్ కూడా రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్‌ను తీవ్రంగా విభేదించారు. రాష్ట్ర విభజన చేయొద్దని ఆయన ఢిల్లీ వెళ్లి పదే పదే వేడుకున్నారు. అయినప్పటికీ.. కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేయడంతో.. ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఢిల్లీ నుంచి టిక్కెట్ తెచ్చుకోగల సమర్థుడు....
హర్షకుమార్ ఏదైనా నిర్మొహమాటంగా అధిష్టానానికే చెప్పేవారు. ఆయనకు అక్కడ ఎంత గ్రిప్ ఉందంటే 2009 ఎన్నికలకు ముందు హర్షకుమార్‌కు ఎంపీ సీటు ఇవ్వొద్దని వైఎస్ గట్టిగా పట్టుబట్టారు. అయితే ఆయన ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉపయోగించుని సీటు తెచ్చుకుని అందరికి షాక్ ఇచ్చారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన సమైక్యాంద్ర పార్టీ తరఫున లోక్‌సభకు పోటీచేసి పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఆయనతో పాటు ఆయన తనయుడు కూడా టి.గన్నవరం నుంచి అసెంబ్లీకి అదే పార్టీ తరపున పోటీ చేసి ఓడారు. సమైక్యాంధ్ర పార్టీలో కొన్నాళ్లు ఉండవల్లితో కలిసి క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే, కొన్నాళ్లకే ఈ పార్టీ కనుమరుగు కావడంతో హర్షకుమార్ పెద్దగా మీడియా ముందుకు రాలేదు.
హర్షకుమార్ ను చేర్చుకునే యోచనలో కాంగ్రెస్...
అయితే, గత రెండేళ్లుగా ఆయన జగన్ నేతృత్వంలోని వైసీపీలోకి చేరతారనే ప్రచారం జరిగింది. కొన్నాళ్ల పాటు ఈ వార్తలు మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే ఎందుకో హర్షకుమార్ మౌనంగా ఉండిపోయారు. ఇక, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ నుంచి పిలుపురావడంతో హర్షకుమార్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జుగా బాధ్యతలు చేపట్టిన కేరళకు చెందిన ఊమెన్ చాందీ.. పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరి వల్ల పార్టీకి పోయిన వైభవం తిరిగి వస్తుందని ఆయన అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హర్షకుమార్‌కు కూడా వర్తమానం పంపినట్టు సమాచారం.
టీడీపీలోకి మాత్రం వెళ్లరు...
2019 ఎన్నికలలో కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకంగా ఉండకపోయినా, 2024 నాటికి మళ్లీ పుంజుకుంటుందని హర్షకుమార్ విశ్వసిస్తున్నట్టు ఆయన అనుచరగణం అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో హర్షకుమార్ కాంగ్రెస్ పునరాగమనం చేస్తారా? ఇంకొన్నాళ్లు వేచి చూస్తారా? అనేదానిపై తర్జనభర్జన జరుగుతోంది. 2014 ఎన్నికలలో టీడీపీ నుంచి పిలుపువచ్చినా హర్షకుమార్ వెళ్లలేదు. ఆది నుంచి టీడీపీ వైఖరిని తీవ్రంగా విమర్శించే హర్షకుమార్ అవసరమైతే.. రాజకీయ సన్యాసం అయినా తీసుకుంటాను కానీ, టీడీపీలోకి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఇక, ఈ నేపథ్యంలోనే రెండేళ్ల నుంచీ వైసీపీలో చేరతారని హర్షకుమార్‌పై విస్తృతంగా ప్రచారం సాగింది.
గత విమర్శలే అడ్డంకిగా మారాయా..?
వైసీపీకి అమలాపురం లోక్‌సభ సీటు కోసం బలమైన అభ్యర్థి లేరు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో అమలాపురం నుంచి ఎంపీగా మళ్లీ పోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే కొన్ని విషయాల్లో ఆయన జగన్‌ను గతంలో తీవ్రంగా విబేధించడంతో పాటు ఆయనపై తీవ్రమైన విమర్శలు చేశారు. దీంతో ఇప్పుడు వైసీపీలోకి వెళ్లాలా ? లేక తనను ఆహ్వానిస్తోన్న తన మాతృపార్టీ కాంగ్రెస్లోకి వెళ్లాలా ? అన్నది ఆయన తేల్చుకోలేక సందిగ్ధంలో అయితే ఉన్నట్టు తెలుస్తోంది. అయినా ఆయన ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఇటీవల తెలుగు పోస్ట్ ప్రతినిధి తో మాట్లడుతూ త్వరలోనే తన భవిష్యత్తు ప్రణాళికని గూర్చి ఒక ప్రకటన చేస్తానని తెలియ చేశారు.మరి ఇప్పుడు హర్షకుమార్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు? అనేది ఆసక్తిగా మారింది.