మేము సిద్దమే... మీరు సిద్ధమా ?

Update: 2018-05-18 07:44 GMT

కర్ణాటక పరిణామాలపై సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్వాగతించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా ఈ తీర్పు రావడం హర్షణీయమన్నారు. బీజేపీపై ఆయన విమర్శలు గుప్పించారు. గతంలో మణిపూర్, గోవా, మేఘాలయలో అతిపెద్ద పార్టీని కాదని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, కర్ణాటకలో కూడా ఏ పార్టీకీ ప్రభుత్వం ఏర్పాటుచేసే మెజారిటీ లేనందున కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి అధికారం చేపట్టే అవకాశం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ కు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పష్టం చేశారు. మణిపూర్, గోవాలో బీజేపీ తీసుకువచ్చిన కొత్త నిబంధనను కర్ణాటకలోనూ అమలుచేస్తారని దేశం మొత్తం ఎదురుచూపిందని, కానీ అది జరగలేదన్నారు. ఇప్పటికిప్పుడు మెజారిటీని నిరూపించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ బీజేపీ మాత్రం సిద్ధంగా లేదన్నారు. వారికి 104 ఎమ్మెల్యేల కంటే ఎక్కువ మద్దతు లేదని తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు బలనిరూపణ చేసుకునేందుకు 1 లేదా 2 రోజుల సమయం ఇచ్చారని, ఎక్కువగా అంటే వారం రోజుల సమయం ఇచ్చారని, కానీ కర్ణాటక గవర్నర్ మాత్రం చరిత్రలో లేని విధంగా 15 రోజులు సమయం ఇవ్వడం సరికాదన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తే ఉల్లంఘించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

Similar News