కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ నుంచి టీడీపీ వ్యవస్థపాకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అసెంబ్లీకి ప్రాతినిత్యం వహించారు. గుడివాడ అంటేనే టీడీపీ కంచుకోట. అలాంటి కంచుకోట కాస్తా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కంచుకోటగా మారిపోయింది. గత మూడు ఎన్నికల్లోనూ అక్కడ వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టిన నాని గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి కూడా గెలిచారు. గత ఎన్నికల్లో గెలుపు తర్వాత నాని అక్కడ వ్యక్తిగతంగానే స్ట్రాంగ్... పార్టీలతో ఆయనకు సంబంధం లేదన్న విషయం రుజువైంది.
లోకేష్ ప్రత్యేక దృష్టి...
ఇక తమ కంచుకోటలో ఎలాగైనా టీడీపీ జెండా ఎగరవేసేందుకు టీడీపీ అధిష్టానం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ యువనేత, మంత్రి లోకేశ్ సైతం గుడివాడ మీద ప్రత్యేకంగా కాన్‌సంట్రేషన్ చేస్తున్నారు. కార్యకర్తలతో మీటింగులు పెడుతూ గుడివాడకు ప్రత్యేక నిధులు సైతం మంజూరయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టీడీపీ అధిష్టానం గుడివాడలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అక్కడ నాని మీద పోటీ చేసేందుకు సరైన క్యాండెట్ దొరకడం లేదు.
ట్రయాంగిల్ ఫైట్...
గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన రావి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి నాని చేతిలో 11 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. రావి, నాని దూకుడు, ఇమేజ్ ముందు ఆగలేకపోతున్నారు. అయితే ఎలాగైనా గుడివాడలో మళ్లీ ఎమ్మెల్యేగా గెలవాలన్న ఆశ మాత్రం ఆయనలో ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో తన ఫ్యామిలీ ఇమేజ్‌తో అయినా వచ్చేసారి గెలవాలని పోటీకి రెడీ అవుతున్నారు.
టిక్కెట్ ఆశిస్తోంది వీరే...
గుడివాడ టీడీపీలోనూ, పార్టీ అధిష్టానంలోనూ రావి అయితే నానికి పోటీ ఇవ్వలేడని చాలా వరకు డిసైడ్ అయిపోయారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఇక్కడ అసెంబ్లీ సీటు రేసులో ఉన్నారు. మాజీ మంత్రి, ఆఫ్కాబ్ చైర్మన్ అయిన గుడివాడ అర్బన్ బ్యాంకు చైర్మన్ పిన్నమనేని పూర్ణ వీరయ్య (బాజ్జీ) పిన్నమనేని అండతో టిక్కెట్ కోసం బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బాబ్జీకి రావికి మధ్య సత్సంబంధాలు లేవు.ఇక మూడో వ్యక్తిగా గుడివాడ మునిసిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు కూడా టిక్కెట్ కోసం బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొడాలికి కుడి భుజం అయిన ఆయన ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో సైకిల్ ఎక్కేశారు. ఉప ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ కౌన్సెలర్ సీటును గెలిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయనకు క్రేజ్ పెరగడంతో పాటు పట్టణంలో ఉన్న పట్టు కూడా తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కలిసి వస్తుందని భావిస్తున్నారు.
నానిని ఢీకొట్టేనా..?
వైసీపీ నుంచి ఒకేఒక్కడిగా బలంగా ఉన్న నానిని ఢీకొట్టేందుకు టీడీపీలో ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్ వస్తుందో ? తెలియని పరిస్థితి. రావి కార్యకర్తల్లోనే పట్టు సాధించలేకపోయారు. ఇక వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన ఇద్దరు ఎంత వరకు సహకరిస్తారన్నది కూడా డౌటే. దీంతో గుడివాడ టీడీపీ నానికి ఫైట్ ఇవ్వలేకపోతోంది.