చిరుతను చంపాడు.. హీరో అయ్యాడు

తన మీద దాడికి ప్రయత్నించిన చిరుతను చంపి ఆ ప్రాంతానికి మీరో అయ్యాడు గోపాలన్

Update: 2022-09-08 12:17 GMT

తన మీద దాడికి ప్రయత్నించిన చిరుతను చంపి ఆ ప్రాంతానికి మీరో అయ్యాడు గోపాలన్. ఇప్పుడు ఆ ప్రాంత వాసులకు అతడు పులి గోపాలన్. కేరళ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ఆత్మరక్షణ కోసం చిరుతపులిని చంపిన గోపాలన్ ఇడుక్కి లోని మంకులం గ్రామంలో హీరోగా మారాడు. అతనికి శాలువలు, కరెన్సీ నోట్లు, బంగారు గొలుసులతో ఆ ప్రాంత ప్రజలు సత్కరిస్తున్నారు. ప్రస్తుతం గోపాలన్ చిరుత దాడిలో గాయపడి ఆదిమాలి తాలూకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్థులు తండోప తండాలుగా చేరుకుంటున్నారు. దీంతో ఆసుపత్రి సందర్శకులతో రద్దీగా ఉంది.

ఆత్మరక్షణ కోసం...
ఆత్మరక్షణ కోసం చిరుతని చంపడంతో అటవీ శాఖ గోపాలన్ చికిత్స కోసం ఐదువేల రూపాయలు సాయం అందించింది. గోపాలన్ వైద్య ఖర్చులతో పాటు రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని డీఎఫ్ఓ జయచంద్రన్ చెప్పారు. ప్రాధమిక సాయంగా అతినికి ఐదువేలు అందించామన్నారు. కేరళ ఇండిపెండెంట్ ఫార్మర్స్ అసోసియేషన్ కూడా గోపాలన్ ధైర్యానికి గుర్తింపుగా జిమ్ కార్బెట్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డుతో పాటు పదివేల రూపాయల నగదు బహుమతిని అందచేశారు. ఇక రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ గోపాలన్ కు కర్షక వీరశ్రీ అవార్డును ప్రకటించింది.
చనిపోతుందని అనుకోలేదు...
తనపై చిరుతపులి దాడి చేసిందని గోపాలన్ తెలిపాడు. తన ప్రాణం పోతుందని భావించానని అందుకే తన చేతిలో ఉన్న కొడవలితో చిరుతపై దాడి చేశానని ఆయన చెప్పారు. తాను ప్రతిఘటించినా చిరుత చనిపోతుందని అనుకోలేదన్నారు. కనీసం పారిపోతుందని అనుకున్నానని, కానీ తాను చేసిన దాడిలో చనిపోయిందని తెలిపాడు. ఈ విషయాన్ని తాను అటవీ శాఖ అధికారులకు చెప్పగా వారు ప్రశంసించారన్నారు. చిరుత దాడిలో గాయపడిన గోపాలన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. గోపాలన్ కు రాబిన్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యులు వెల్లడించారు.


Tags:    

Similar News