సమాధి అవుతున్నా పట్టించుకోరే...?

Update: 2018-05-16 02:30 GMT

గోదావరి, కృష్ణా నదులు... ఏవైనా కావొచ్చు. ప్రమాదాలు ఎక్కడన్నా జరగొచ్చు . కానీ అప్పుడే యంత్రాంగం కళ్ళు తెరుస్తుంది. తాజాగా పాపికొండల సమీపంలో గోదావరి నదిలో చోటు చేసుకున్న ప్రమాదం అందరిలో మరోసారి ఆందోళన, ఆవేదన మిగిల్చింది. ప్రమాదకరమైన నీటి ప్రయాణంలో పాటించాలిసిన జాగ్రత్తలు నీళ్ళల్లోనే సమాధి అవుతున్నాయి. ఫలితంగా ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు జలసమాధి అవుతున్నారు ప్రయాణికులు. తాజాగా జరిగిన దేవీపట్నం మండలం మంటూర్ లాంచీ ప్రమాదం మరో దుర్ఘటనగా నిలిచిపోయింది.

వరుస ప్రమాదాలతో పర్యాటకానికి చేటు ...

గోదావరిలో ప్రయాణం ప్రమాద భరితం. అందులో ప్రయాణం చేసే వారు పడవల్లో అయినా లాంచీల్లో అయినా లైఫ్ జాకెట్ తప్పనిసరిగా ధరించి ఉండాలి. వాటిని అందుబాటులో ఆ వాహన యాజమాన్యం ఏర్పాటు చేయాలి. కానీ చాలా పడవలు లాంచీల్లో ఇలాంటివి మచ్చుకైనా కనిపించావు. ఇవి ఉన్నాయో లేవో చెక్ చేసి యాత్ర ప్రారంభం ముందే పోలీసులు చెక్ చేసి పంపాలి. ఇక్కడ కూడా ప్రయివేట్ బోట్ ఆపరేటర్ల దందా సాగుతుంది. పోలీసులను సైతం వారు లంచాలతో తమవైపు తిప్పుకుంటున్నారు. ఫలితంగా ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే వ్యవస్థ సక్రమంగా పని చేయడం లేదు. ఇప్పుడు జరిగిన లాంచీ ప్రమాదంలో గిరిజనులే ఎక్కువమంది వుంటారు. వారికి జల మార్గం తప్ప మరొకటి లేని దుస్థితి. ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థపై ప్రభుత్వం దృష్టి పెట్టాలిసిన అవసరాన్ని ఈ ప్రమాదం మరోసారి స్పష్టం చేస్తుంది. నీరే కదా అని జల ప్రయాణంలో ఏమరుపాటుగా ఏ మాత్రం వున్నా ఇక అంతే సంగతులు అని గుర్తించుకోవాలి.

Similar News