మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రాజకీయాల్లో కొనసాగడంపై పునరాలోచనలో పడ్డారు. గల్లా అరుణకుమారి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా గల్లా అరుణకుమారి చంద్రగిరి నియోజకవర్గ ఇన్ ఛార్జి పదవి నుంచి కూడా తప్పుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబును గత నెలలో కలిసి తనను ఇన్ చార్జి పదవి నుంచి తప్పించాలని కూడా కోరారు.
టీడీపీ నేతల వల్లనే......
చంద్రగిరి నియోజకవర్గంలో తనతో పాటు కాంగ్రెస్ నుంచి వచ్చిన కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాననే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ప్రధానంగా టీడీపీ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆమె అనేకసార్లు ఆవేదన చెందారు. వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన గల్లా అరుణకుమారి గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి చేతిలో దారుణంగా ఓటమిపాలయ్యారు. రాష్ట్రమంతటా టీడీపీ గాలి వీచినా చంద్రగిరిలో మాత్రం పసుపు జెండా ఎగరలేదు. దీంతో ఆమె అప్పుడే రాజకీయాల నుంచి తప్పకోవాలనుకున్నారు.
పార్టీ మారడం లేదని.......
కాని చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గ ఇన్ ఛార్జి బాధ్యతలను అప్పగించడంతో నాలుగేళ్లుగా ఆ నియోజకవర్గంలో పట్టు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాని టీడీపీ నేతల నుంచి సహకారం అందకపోవడంతో ఆమె నిర్వేదంలోకి వెళ్లి రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నారు. కాని చంద్రబాబు మాత్రం గల్లాను తిరిగి చంద్రగిరి నుంచే పోటీ చేయించాలని భావిస్తున్నారు. దీంతో విదేశాల నుంచి తిరిగి వచ్చిన గల్లా అరుణకుమారి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి తాము టీడీపీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. పార్టీ మారబోవడం లేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని గల్లా తన అనుచరులకు సూచించారు. మొత్తం మీద గల్లా అరుణకుమారి పార్టీ వీడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పారు. మరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అన్నది రెండు, మూడు రోజుల్లో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమె ప్రకటించే అవకాశం ఉంది.