తూర్పు టీడీపీలో ఆ ఆరుగురు ఎమ్మెల్యేల మార్పు ఖాయమా?

Update: 2018-06-06 03:14 GMT

టీడీపీకి ఎంతో బ‌లాన్నిచ్చి 2014లో పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు సాయం చేసిన తూర్పు గోదావ‌రి జిల్లాలో టీడీపీ బ‌ల‌హీన ప‌డుతోందా? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రింత బ‌ల‌హీన ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోందా? అంటే.. టీడీపీ సీనియ‌ర్లే.. ఔన‌ని అంటున్నారు. ముఖ్యంగా కొంద‌రు సీనియ‌ర్లు.. తమ‌కు పనుంటేనే నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరుగుతున్నార‌ని, లేకుండా ఏళ్లు గ‌డిచినా ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. అధినేత చంద్ర‌బాబు ఏదైనా ఆదేశిస్తే.. త‌ప్ప త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ త‌ర‌ఫున కానీ, ప్ర‌భుత్వం త‌ర‌ఫున కానీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం లేద‌ని కూడా తెలుస్తోంది.

మొత్తంగా ఆరుగురు కీల‌క ఎమ్మెల్యేలు.. కాల‌ర్ ఎగ‌రేసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టీడీపీ అధిష్టానానికి స‌ర్వే నివేదిక అందింది. దీంతో ఆ ఆ రుగురికి ప‌క్క‌కు పెట్టాల‌ని బాబు ప్రాథ‌మికంగా నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. విష‌యంలోకి వెళ్తే.. జిల్లా కేంద్ర మైన కాకినాడ లోక్‌సభ పరిధిలోని మెట్ట ప్రాంతంలో ఒక ఎమ్మె ల్యే ప్రజలు, పార్టీ కార్యకర్తలను పట్టించు కోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి. సదరు ఎమ్మెల్యేకి వయసు రీత్యా కూడా ఈసారి తప్పించాలన్నది పార్టీ నేతల యోచన. ఆ స్థానంలో ఆయన సమీప బంధువుకే టిక్కెట్టు ఇస్తారన్న ప్రచారం ఉంది.

కాకినాడ పరిధిలో ఒక ఎమ్మెల్యే మార్పుపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. అభివృద్ధి పనులు చెప్పుకోదగ్గరీతిలో చేసినా వారి కుటుంబ సభ్యుల ఆగడాలు, ల్యాండ్‌ సెటిల్‌మెంట్లతో ప్రజల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ఈ స్థానంలోనూ కొత్త అభ్యర్థిని వెతుకుతున్నట్టు తెలుస్తోంది. రాజమహేంద్రవరం లోక్‌సభ పరిధిలో గత ఎన్నికలలో స్వల్ప తేడాతో గట్టెక్కిన ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి వ్యక్తిగత సానుభూతి క్రమంగా పెరుగుతోంది. ఇక్కడ బలమైన అభ్యర్థిని పోటీకి దించాలని కీలక ప్రజాప్రతినిధులు కూడా ప్రతిపాదనలు పెడుతున్నారు.

ఇక‌, లాభసాటి దందాలలో మెట్ట, కోనసీమ అనే తేడా లేకుండా వైసీపీ వాళ్లతో టీడీపీ ప్రజాప్రతినిధులు దోస్తీ కట్టడం పార్టీ కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు పంపుతోంది. ఈ అక్రమ లావాదేవీలకు చెక్‌ చెప్పకపోతే ముందు నుంచీ పార్టీలోనే కొనసాగుతున్న అసలు సిసలు టీడీపీ కార్యకర్తలు వచ్చే ఎన్నికల నాటికి దూరమయ్యే ప్రమాదం ఉంది. దీనిపై పార్టీ అధిష్ఠానం ఇప్పటి నుంచీ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. మహానాడు తర్వాత పార్టీలో వచ్చిన జోష్‌ కొనసాగాలంటే ప్రత్యర్థి పార్టీ నేతలతో చేతులు కలుపుతున్న టీడీపీ ప్రజాప్రతినిధులను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఏజెన్సీ రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్‌లో వచ్చే ఎన్నికలలో బలమైన అభ్యర్థి కోసం ఇప్పటి నుంచీ దృష్టిసారించాలని పార్టీ అధిష్ఠానానికి కేడర్‌ నుంచి విజ్ఞాపనలు వెళుతున్నాయి. తనతోపాటు వైసీపీ నుంచి వచ్చిన కేడర్‌కే ఎమ్మెల్యే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, టీడీపీ సీనియర్లను కలుపుకుపోలేకోతున్నారన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా తూర్పులో ఆరుగురు సిట్టింగ్ అధికార పార్టీ ఎమ్మెల్యేల‌కు ఈ సారి టికెట్ ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని ప్ర‌చారం ఊపందుకోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Similar News