డిగ్గీరాజా డీప్ స్టడీ.. మొత్తం మార్చాల్సిందే

తెలంగాణ కాంగ్రెస్ పరిణామాలను గమనించిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అధిష్టానానికి ఇచ్చిన నివేదిక నేతల్లో కలవరం రేపుతుంది

Update: 2022-12-30 08:12 GMT

తెలంగాణ కాంగ్రెస్ పరిణామాలను గమనించిన పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అధిష్టానానికి ఇచ్చిన నివేదిక నేతల్లో కలవరం రేపుతుంది. తెలంగాణలో సీనియర్ నేతలు తొమ్మిది మంది అసంతృప్తికి గురికావడంతో దిగ్విజయ్ సింగ్ ను హుటాహుటిన హైకమాండ్ పరిశీలకుడిగా పంపింది. సీనియర్ నేతలు అందరూ ముక్త కంఠంతో ఒకే మాట చెప్పారు. అదీ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ వ్యవహార శైలిని ముక్తకంఠంతో తప్పు పట్టారు. మాణికం ఠాగూర్ ఏకపక్ష వైఖరివల్లనే ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయని గట్టిగా చెప్పారు.


తక్షణమే తొలగించాలని...

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైన కంటే పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ పైనే ఎక్కువ ఫిర్యాదులు నేతలనుంచి అందాయి. ఆయనను తక్షణం మారిస్తే తప్ప పార్టీ సెట్ కాదని డిగ్గీరాజా హైకమాండ్ కు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారని తెలిసింది. సమస్యలన్నింటికీ మూలం మాణికం ఠాగూర్ మాత్రమేనని, నేతలను సమన్వయం చేసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందన్న కామెంట్స్ దిగ్విజయ్ సింగ్ కొంత కటువుగానే చేసినట్లు తెలిసింది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తక్షణం ఆయనను మార్చాల్సిందేనని విస్పష్టంగా పేర్కొన్నారని తెలిసింది. త్వరలోనే మాణికం ఠాగూర్ ను మార్చి తెలంగాణ కాంగ్రెస్ లో నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టాలని హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ప్రియాంక పేరు వినిపించినా...
అయితే ఆయన స్థానంలో ఎవరిని పంపాలన్న దానిపై కూడా హైకమాండ్ చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రియాంక గాంధీకి రాష్ట్ర ఎన్నికల వరకూ బాధ్యతలను అప్పగిస్తే మొత్తం సెట్ అవుతుందని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ లోనూ ప్రియాంక ఎంటర్ అయిన తర్వాతనే అక్కడ పార్టీలో సమస్యలు ఒక కొలిక్కి వచ్చాయని కొందరు గుర్తు చేస్తున్నారు. అయితే ప్రియాంకకు దక్షిణాదిన ఉన్న తెలంగాణకు పంపి ప్రయోగం చేయడం ఎందుకని? ఆమె ఖాతాలో మరో ఓటమిని మూటగట్టడం ఎందుకన్న ప్రశ్న కూడా కొందరి నేతల నుంచి రావడంతో హైకమాండ్ పునరాలోచనలో పడిందని చెబుతున్నారు. ప్రియాంక గాంధీని ప్రచారానికి పంపవచ్చని, అంతే తప్ప రాష్ట్ర బాధ్యతలను అప్పగించడం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమయిందట.

ట్రబుల్ షూటర్ గా...
ఇదిలా ఉండగా కొత్తగా హర్యానాకు చెందిన సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. 1986 నుంచి పార్టీలో ఉన్న సూర్జేవాలా హైకమాండ్ కు నమ్మకస్థుడిగా పేరుంది. యూత్ కాంగ్రెస్ నేత నుంచి ఆయన ప్రయాణం కాంగ్రెస్ లో ప్రారంభమయింది. రాజస్థాన్ బాధ్యతలను కూడా హైకమాండ్ అప్పగించింది. అక్కడి నుంచే ఆయనను హైకమాండ్ రాజ్యసభకు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో రణదీప్ సూర్జేవాలా అయితే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ట్రబుల్ షూటర్ గా కూడా పేరున్న ఆయనైతేనే కొంత పార్టీ గాడిన పడుతుందన్న ఒపీనియన్ కు వచ్చిందంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.


Tags:    

Similar News