సీనియర్ నేత, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతకొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పై నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలంతా ఒక్కటై సమావేశమయ్యారు. ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత దీనికి సారథ్యం వహించడం విశేషం. డీఎస్ కదలికలపై తమకు అనుమానం ఉందని, డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ నేతలంతా ఒక్కటే డీఎస్ కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. డీెఎస్ కావాలని నిజామాబాద్ అర్బన్, రూరల్ జిల్లాల్లో పార్టీని బలహీన పరుస్తున్నారన్నారు.
కొడుకు కోసం....
టీఆర్ఎస్ లో కొనసాగుతూ పచ్చి అవకాశవాదిగా మారి కొడుకును బీజేపీలోకి పంపారన్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు డీఎస్ ఢిల్లీ పెద్దలతోమంతనాలు జరుపుతున్నారు. ఒక కుటుంబం కోసం పార్టీ ఇబ్బంది పడుతుందని, ఇన్ని రోజులు ఓపిక పట్టామని, ఇంకా ఆయనను ఇక ఉపేక్షిస్తే పార్టీకి నష్టం తప్పదని ఆ లేఖలో హెచ్చరించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మరి డీఎస్ వ్యవహారంలో కేసీఆర్ ఎలాాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.