అందుకే వీరు దూరంగా ఉన్నారా?

జగన్ 27 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారన్నారు. గడప గడపకు ప్రభుత్వం వర్క్ షాప్ లో ఆయన హెచ్చరించారన్న వార్తలు వచ్చాయి.

Update: 2022-10-02 04:54 GMT

మొన్నా మధ్య జగన్ 27 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారన్నారు. గడప గడపకు ప్రభుత్వం వర్క్ షాప్ లో ఆయన హెచ్చరించారన్న వార్తలు వచ్చాయి. ఆ కార్యక్రమంలో ఈ ఎమ్మెల్యేలు సక్రమంగా పాల్గొనడం లేదని, ప్రజల్లో ఉండటం లేదని జగన్ చెప్పారు. అయితే జగన్ హెచ్చరించినట్లు చెబుతున్న నేతలందరూ మంత్రి పదవులు రాని వారే. రెండో విడత అయినా తమకు మంత్రి పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్న వారే. అందుకే వారిలో నైరాశ్యం నెలకొందా? లేక ఎంత చేసినా తమకు ఇక మంత్రి పదవి రాదని వారు భావించడమే కారణమా? అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

మంత్రి పదవులు వచ్చిన తర్వాత...
ప్రస్తుత మంత్రులు ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావులు ఉన్నారు. వీరు మంత్రులు అయ్యాక ప్రజలకు దూరమయ్యారన్నది జగన్ కు అందిన నివేదికలను బట్టి చెబుతున్నాయి. బుగ్గన అంటే తన వారసుడిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలనుకుంటున్నారు. ఇక మాజీ మంత్రుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని కూడా పనితీరు మెరుగుపర్చుకోవాలని జగన్ సూచించారు. మంత్రి పదవి పోయిందని వీరు అసహనంతో ఉన్నారా? అని చర్చ జరుగుతోంది. మంత్రి పదవులు రెండున్నరేళ్లు మాత్రమే ఉంటాయని జగన్ ముందుగానే చెప్పారు. నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గెలిస్తేనే మళ్లీ మంత్రి అవుతారు. ఆ సంగతి తెలిసినా ఎందుకు కార్యక్రమంలో పాల్గొనడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఆశలు వమ్ము కావడంతో...
ఇక మంత్రి పదవులు వస్తాయని ఎందరో ఆశలు పెట్టుకున్నారు. సీనియారిటీ, సామాజికవర్గం కోణంలో తమను జగన్ మంత్రిని చేస్తారన్న ఆశతో అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన వారికి కూడా మంత్రివర్గంలోకి ఛాన్స్ ఇస్తుండటంతో అందరిలోనూ ఆ ఆశలు ఉన్నాయి. 1510 మందిలో తాము కూడా మంత్రి అవ్వాలన్న కోరిక అందరికీ ఉంటుంది. కానీ రెండు దఫాలు తమకు దక్కకపోవడంతో వారిలో నిస్పృహ మొదలయిందంటున్నారు. మంత్రి వర్గ సభ్యుల ఎంపికలో జగన్ లెక్కలు వేరుగా ఉంటాయని వారు భావిస్తున్నారు.
నమ్మకంగా ఉన్నా....
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గ్రంధి శ్రీనివాస్, శిల్పా చక్రపాణి రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, కోడుమూరు శ్రీనివాసులు వంటి వారు గడప గడపకు ప్రభుత్వం కార్కక్రమంలో పెద్దగా పాల్గొనడం లేదని నివేదికలు చెబుతున్నాయి. వీరందరూ మంత్రి పదవులను ఆశించిన వారే. కాని రెడ్డి సామాజికవర్గం కొందరికి అడ్డంకి అయితే కొందరికి వేరే కారణాల దృష్ట్యా మంత్రి పదవులు దక్కలేదు. దీంతో వీరి పేర్లు కూడా జగన్ కు అందిన నివేదికలో చేరిపోయాయి. తాము జగన్ కష్టకాలంలో అండగా ఉన్నప్పటికీ తమను పట్టించుకోలేదన్న అసహనం వీరిలో కనిపిస్తుందంటున్నారు. అందుకే వీరిలో అధిక శాతం మంది జగన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ కార్యక్రమాన్ని లైట్ గా తీసుకున్నారంటున్నారు. మరి డిసెంబరు నాటికైనా వీరు యాక్టివ్ అవుతారా? లేదా? అన్నది చూడాలి.


Tags:    

Similar News