టీడీపీ ఎంపీలు ఢిల్లీలో ఎందుకు? బాబు వ్యూహమేంటి?

Update: 2018-04-07 09:30 GMT

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులను ఢిల్లీని వదిలి రావద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఢిల్లీలోనే కొద్దిరోజులు ఉండి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని దిశానిర్దేశం చేశారు. వాస్తవానికి పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. చంద్రబాబు కూడా ఎంపీల చేత బస్సుయాత్ర చేయించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజలకు వాస్తవ వివరాలను అందించాలని, పార్లమెంటులో తాము ఏ రకంగా పోరాడిందీ వివరించాలన్నది చంద్రబాబు యత్నం.

బస్సు యాత్ర అని చెప్పి....

కేంద్ర ప్రభుత్వం చేసిన మోసంతో పాటుగా వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీతో కుమ్మక్కయిన విషయాన్ని కూడా బస్సుయాత్రలో వివరించాలని చంద్రబాబు నిర్ణయించారు. బస్సుయాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్ ను కూడా ఖరారు కానున్న నేపథ్యంలో చంద్రబాబు ఎంపీలందరినీ ఢిల్లీలోనే ఉండి పొమ్మనడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమ ప్రాంతాలకు వెళ్లాలని ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఎంపీలు తిరిగి వెనక్కు వెళ్లీారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో టీడీపీ ఎంపీలంతా సమావేశమయ్యారు.

రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోసం....

ఒకవైపు వైసీపీ ఎంపీలు హస్తినలో ఉండి ఆమరణ దీక్షలు చేస్తుంటే టీడీపీ ఎంపీలు రావడం బాగుండదని చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలిసింది. దీంతో అక్కడే ఉండి కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తేవాలని భావిస్తున్నారు. సాయంత్రంలోపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు కార్యాచరణ ఇవ్వనున్నారు. తొలుత రాష్ట్రపతిని టీడీపీ ఎంపీలు కలవనున్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని రాష్ట్రపతికి వివరించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కూడా టీడీపీ ఎంపీలు కోరారు.

మరికాసేపట్లో దిశానిర్దేశం.....

ఎంపీలు ఢిల్లీ వదలి రావద్దంటూ చంద్రబాబు ఆదేశాలు ఆ పార్టీ ఎంపీల్లో చర్చనీయాంశమైంది. రాజీనామాలు చేయమంటారా? లేక మరేదైనా వ్యూహాన్ని ఇస్తారా? అన్న మీమాంసలో టీడీపీ ఎంపీలున్నారు. తాము చంద్రబాబు ఏది ఆదేశించినా వెంటనే అమలు చేస్తామని టీడీపీ ఎంపీలు చెబుతున్నారు. చంద్రబాబు మరికొద్ది సేపట్లోనే వారు చేయాల్సిన పనులను వివరించనున్నారు. దీంతో ఎంపీలందరూ ఢిల్లీలోనే ఉండిపోయారు. అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు వారితో మాట్లాడే అవకాశముంది.

Similar News