పెద్దాయన బాగా ఫీలవుతున్నారా?

ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు ఈసారి స్టేట్ కే పరిమితమయ్యారు.

Update: 2022-06-15 04:05 GMT

రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ ను నేడు వెలువడనుంది. రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కాానుంది. అయితే ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు ఈసారి స్టేట్ కే పరిమితమయ్యారు. ఎంపీల సంఖ్య పెద్దగా లేకపోవడం. నిలకడలేని స్వభావంతో చంద్రబాబును ఎవరూ నమ్మలేని పరిస్థితి ఉంది. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం చంద్రబాబును రాష్ట్రపతి ఎన్నికల్లో సీరియస్ గా తీసుకోవడం లేదు.

ఎన్నో సక్సెస్ లు...
నలభై ఏళ్ల చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎన్నో సక్సెస్ లు చూశారు. అబ్దుల్ కలామ్ ను రాష్ట్రపతిగా చేశానంటారు. దేవెగౌడ ప్రధాని కావడానికి తానే కారణమంటారు. నిజంగా ఆనాటి రాజకీయాల్లో అయి ఉండవచ్చు. కానీ గత దశాబ్దన్నర కాలానికి పైగా చంద్రబాబుకు ఢిల్లీలో పెద్దగా పనిలేకుండా పోయింది. 2004 నుంచి ఆయన ప్రతిపక్షంలో పదేళ్ల పాటు ఉన్నారు. 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయినా బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రావడంతో కేంద్రం పెద్దలతో తొలి మూడేళ్లు సత్సంబంధాలు, తర్వాత వైరాన్ని పెంచుకున్నారు.
పార్టీలు మార్చి....
చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ తో జత కట్టారు. 2019 ఎన్నికల సమయంలో దేశంలోని అన్ని విపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేసినా పెద్దగా సత్ఫలితాలు ఇవ్వలేదు. తిరిగి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం, ఇక్కడ టీడీపీ ఓటమి పాలు కావడంతో ఆయన ఢిల్లీ వైపు వెళ్లలేదు. ఒకేసారి వెళ్లి రాష్ట్రపతిని కలిసి వచ్చారు. దీనికి తోడు విపక్షాలు కూడా ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో జత కట్టి, ఎన్నికల ఫలితాల తర్వాత మోదీతో సఖ్యతను కోరుకోవడంతో ఆయనను హస్తినలో ఎవరూ నమ్మడం లేదు. గతంలో ఆప్తులుగా ఉన్నవారు సయితం చంద్రబాబును పూర్తిగా మర్చిపోయినట్లే కనపడుతుంది. ఆయన బీజేపీకి మద్దతు పలుకుతారన్న స్పష్టమైన సంకేతాలుండటంతోనే విపక్షాలు కూడా వదిలేశాయి.
ఎవరూ పట్టించుకోవడం లేదే?
రాష్ట్రపతి ఎన్నికలకపై ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి కూడా మమత బెనర్జీ నుంచి చంద్రబాబుకు ఆహ్వానం లేదు. టీడీపీకి నలుగురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీకి కూడా ఆయన సహకారం అవసరమే. కానీ ఇప్పటి వరకూ బీజేపీ నేతలెవ్వరూ చంద్రబాబును సంప్రదించలేదు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత బాబును కలిసే వీలుండవచ్చు. ఎందుకంటే ఎంతో కొంత బలం ఉంది. కానీ చంద్రబాబును మాత్రం జాతీయ రాజకీయాల్లో దాదాపు అన్ని పార్టీలూ మర్చిపోయారనే అనుకోవాలి. ఏపీ విభజన తర్వాత బాబు ఇమేజ్ జాతీయస్థాయిలో మరింత పడిపోయింది. ఇప్పుడు ఆయనను పట్టించుకునే వారు ఎవరూ లేకపోవడం బాధాకరమే.


Tags:    

Similar News