పోలవరంపైనే చంద్రబాబు ఆశలు ఎక్కువగా పెట్టుకున్నట్లుంది. వచ్చే ఎన్నికల్లో తనను గట్టెక్కించేది పోలవరమేనని ఆయన భావిస్తున్నట్లుంది. అందుకోసమే ఇక రోజూ రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన రైతులను పోలవరం సందర్శించే ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. పోలవరం నిర్మాణాన్ని రైతులు సందర్శించి కథలు కథలుగా గ్రామాల్లో చెప్పుకునేలా చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. ఈ మేరకు నిన్న పోలవరం సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడకు వచ్చిన రైతులతో మాట్లాడారు.
ఒక్కొక్కరూ వేయి మందికి చెప్పాలి.....
ఒక్కొక్కరూ వెయ్యి మందికి పోలవరం గురించి చెప్పాలన్నారు. పోలవరం వస్తే ఏపీ దశ మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎక్కడా పంటలు ఎండకుండా నదుల అనుసంధాన ప్రక్రియను తాను కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రతిరోజూ 750 మంది రైతులను పోలవరానికి తెచ్చి, వారికి పోలవరం నిర్మాణ పనులు చూపించి, ప్రాజెక్టుపై అవగాహన కల్పించి, భోజనం పెట్టి మరీ పంపించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
విపక్షాలపై విమర్శలు.....
విపక్షాలు పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు. ప్రాజెక్టు ఆగిపోతే తనపై వ్యతిరేకత వస్తుందన్న ఆశతో ప్రాజెక్టుకు కొన్ని పార్టీలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని పరోక్షంగా వైసీపీపై చంద్రబాబు ధ్వజమెత్తారు. అందుకోసమే రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై న్యాయస్థానాలకు, ట్రిబ్యునల్స్ కు వెళుతున్నాయన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు తనకు అండగా నిలిస్తే పోలవరం కలను సాకారం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుపై కేవలం రైతులే కాకుండా విద్యార్థులు కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రాజెక్టును చూసి దాని గురించి అందరికీ వివరంగా చెప్పాలని చంద్రబాబు కోరారు.