పార్లమెంట్లో జరిగిన అవిశ్వాస చర్చలో నరేంద్ర మోడీ గంటన్నర ప్రసంగించారు. ఆయనకు కౌంటర్ గా ఎపి సీఎం అమరావతిలో అర్ధరాత్రి మీడియా సమావేశం పెట్టి మరీ గంట సేపు మోడీ పైనా రాష్ట్రంలోని విపక్షాలపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ప్రధాని మోడీ దిగజారి మాట్లాడారని దుయ్యబట్టారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఏపీకి సాయం చేస్తామంటేనే ప్యాకేజీకి ఒప్పుకున్నామని కానీ అది లేదు ఇది లేకపోతే ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశామన్నారు ఆయన. న్యాయం జరుగుతుందని చూసి అన్యాయం జరుగుతుంటే బిజెపితో కొనసాగి ప్రయోజనం ఏమిలేదని పోరాటానికి దిగామని వెల్లడించారు. అలా చేస్తే టిడిపి యూటర్న్ తీసుకుందని వ్యాఖ్యానించడం ప్రధాని స్థాయికి తగదన్నారు ఆయన.
పవన్ పై బాబు వెరీ సీరియస్ ...
ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు కన్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోక్ సభలో చర్చ జరుగుతున్నంత సేపు ఉదయం నుంచి ట్విట్టర్ లో చేసిన ట్వీట్ లు టిడిపి అధినేత ను అసహనానికి గురిచేశాయి. పవన్ ట్వీట్ లపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క రాష్ట్ర ప్రయోజనాలకోసం చట్టసభలో సీరియస్ గా పోరాడుతుంటే ఆయన ట్వీట్ లు తనపై చేయడం ఏమిటో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. వైసిపి నాయకుడు కోర్ట్ కు పోయారని, పవన్ కళ్యాణ్ మాత్రం తనపై విమర్శలు చేయడం పై సీఎం తన అసంతృప్తిని తీవ్రంగా వ్యక్తం చేశారు. తమిళనాడులో కావేరి వంటి వివాదాలు ఏమైనా ఉంటే రాష్ట్రం మొత్తం అన్ని పార్టీలు కలిసి పోరాడతామని కానీ ఎపి లో వైసిపి, జనసేన రాజకీయ లబ్ది కోసం తనపై యుద్ధం చేస్తున్నాయని గర్జించారు బాబు. ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియా ముందు జరిగిన అన్యాయం మరోసారి వివరిస్తా అన్నారు టిడిపి అధినేత.