కసితీరా మోడీని....!

Update: 2018-04-25 02:36 GMT

ప్రత్యేక హోదా నినాదంలో దూసుకెళ్లాలన్న తలంపుతో ఉన్న చంద్రబాబు తిరుపతి బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఆయన తిరుపతిలో మోడీపై గట్టిగా విరుచుకుపడనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి బహిరంగ సభకు లక్ష మంది వచ్చేలా ఏర్పాటు చేయలని నిర్ణయించారు. తొలుత తిరుపతి బహిరంగసభకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కార్యకర్తలను తరలించాలని భావించినా, ఖర్చుతో కూడుకున్నది కావడం, అలాగే ప్రతి జిల్లాలో ఇలాంటి సభలను నిర్వహించాలని భావించడంతో తిరుపతి సభకు జనసమీకరణను చిత్తూరు జిల్లాకే పరిమితం చేశారు. చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి లక్ష మందిని సభకు రప్పించాలని చంద్రబాబు నేతలను ఆదేశించారు.

సభను విజయవంతం చేయాలని......

తిరుపతి సభపై చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మోడీని కసితీరా విమర్శించడం ద్వారా పడిపోయిన పార్టీ గ్రాఫ్ ను పెంచాలన్నది బాబు ప్రయత్నంగా కన్పిస్తోంది. అందుకే తిరుపతి సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలను గట్టిగా ఆదేశించారు. తిరుపతి సభకోసం మంత్రులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మంత్రులు నక్కా ఆనందబాబు, అచ్చెన్నాయుడులతో పాటు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్యలు ఈ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. టీడీపీ భవిష్యత్ ఆందోళనలను కూడా ఈ సభ ద్వారా చంద్రబాబు వెల్లడించనున్నారు.

Similar News