అవిశ్వాసంలో బాబు మార్క్ ట్విస్ట్‌

Update: 2018-07-20 02:41 GMT

మోడీ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేంత బ‌ల‌ము లేద‌ని బాబుగారికి తెలుసు..అవిశ్వాసం వీగిపోతుంద‌నీ తెలుసు... మ‌రి ఎందుకిలా చేస్తున్నారు.. ఏం చేయ‌బోతున్నారు.. అస‌లు ఆయ‌న వ్యూహం ఏమిటి.. అని అడిగితే మాత్రం ఒక స‌మాధానం వ‌స్తుంది.. అదే స‌భ‌లో సాధ్య‌మైనంత వ‌ర‌కూ ఏపీకి బీజేపీ అన్యాయం చేసింద‌ని చూపించ‌డం.. అదే స‌మ‌యంలో బీజేపీయేత‌ర ప‌క్షాల‌తోపాటు.. ఎన్డీయేలోని ప‌లు పార్టీల‌తోనూ మోడీకి వ్య‌తిరేకంగా మాట్లాడించ‌డం.. ఇందు కోసం ఇప్ప‌టికే బాబుగారు నాలుగైదు రోజులుగా లాబీయింగ్ స్టార్ట్ చేశారు. బీజేపీయేత‌ర ప‌క్షాల మ‌ద్ద‌తు కోరుతూ చంద్ర‌బాబు లేఖ‌లు కూడా రాశారు. ఇక ఎన్డీయేలో కొన‌సాగుతూ మోడీపై గుర్రుగా వారితో స‌భ‌లో వ్య‌తిరేకంగా మాట్లాడించేందుకు లాబీయింగ్ చేయిస్తున్నార‌నీ, ఈ మేర‌కే మంత్రి య‌న‌మ‌ల ఢిల్లీలో మ‌కాం వేశార‌ని తెలుస్తోంది.

అవిశ్వాసంపై నేడు చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. అయితే అవిశ్వాసం వీగిపోతుంద‌ని టీడీపీ నేత‌లే వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. తాను వెళ్లినా.. వెళ్ల‌క‌పోయినా.. జ‌ర‌గాల్సింది జ‌రుగుతుంద‌నీ, అవిశ్వాసం వీగిపోతుంద‌ని ఆ పార్టీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి బాంబు పేల్చారు. తాము అవిశ్వాసం గెల‌వ‌లేమ‌ని తెలుసు అంటూ ఆ పార్టీ మ‌రో ఎంపీ సుజ‌నాచౌద‌రి వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. అంటే.. అవిశ్వాసంపై చ‌ర్చ సంద‌ర్భంగా మోడీ ప్ర‌భుత్వాన్ని క‌డిగిపారేయ‌డ‌మే లక్ష్యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పావులు క‌దిపిన‌ట్టు తెలుస్తోంది. ఏపీకి కేంద్రం అన్యాయం చేసింద‌నే విష‌యాన్ని బ‌లంగా వినిపించేందుకు దీనిని వేదిక‌గా చేసుకుంటున్నారు.

అయితే, ఇదే స‌మ‌యంలో బీజేపీయేత‌ర ప‌క్షాలు కూడా అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఇస్తున్నాయి.. ఇందులో టీఆర్ఎస్‌తోపాటు ప‌లు పార్టీలు త‌ట‌స్థంగా ఉండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కానీ, కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని కీలక ప్రాంతీయ పార్టీలు దీనిని అవ‌కాశంగా తీసుకుని మోడీ వైఫ‌ల్యాల‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. మోడీ వ్య‌తిరేక ఈ నేప‌థ్యంలోనే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌లు పార్టీల మ‌ద్ద‌తు కోసం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఏపీకి అన్నివిధాలుగా న్యాయం చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీయేన‌ని ఆ పార్టీ నేత‌లు ప్ర‌య‌త్నించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మ‌రి అవిశ్వాసం ఎలా సంచ‌ల‌నాలు, ట్విస్టుల‌తో ముగుస్తుందో ? చూడాలి

Similar News