వద్దంటున్న బాబు...చేస్తామంటున్న వాళ్లు

Update: 2018-04-12 11:30 GMT

ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలుకోరుతూ ఈ నెల 16వ తేదీన వామపక్షాలు, ప్రత్యేకహోదా సాధన సమితి ఏపీ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు కాంగ్రెస్, జనసేన పార్టీలూ మద్దతు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకే ఏపీ ప్రజలు ఈనెల 16వ తేదీన స్వచ్ఛందంగా బంద్ పాటించాలని హోదా, విభజనహామీల సాధన సమితి సభ్యులు కోరారు. ఈ బంద్ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తామని చెప్పారు. బంద్ లు చేయాలని తమ కోరిక కాదని, కేంద్ర ప్రభుత్వం ఏపీని పట్టించుకోక పోవడం వల్లనే బంద్ కు పిలుపునిచ్చామని వామపక్ష నేతలు అంటున్నారు.

బంద్ వల్ల రాష్ట్రానికే నష్టం....

అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం బంద్ వద్దంటున్నారు. బంద్ వల్ల నష్టపోయేది రాష్ట్రమేనని, కేంద్రం కాదని చంద్రబాబు చెబుతున్నారు. బంద్ లు, రాస్తారోకోల కారణంగా ఏపీ అభివృద్ధి కుంటుపడిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం తమను మోసంచేసిదని, వారిపై యుద్ధం చేయాలి గాని, రాష్ట్ర ప్రజలు నష్టపోయే విధంగా ఆందోళనలు చేయడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. కేంద్రంపై పోరాటం చేయాలంటే ఢిల్లీ వెళ్లి చేయాలి గాని, రాష్ట్రంలో ఆందోళనలకు దిగడం సరికాదని చంద్రబాబు చెబుతున్నారు.

ఢిల్లీలో చేయాలంటూ....

అందరం కలసి ప్రధాని మోడీపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. ప్రత్యేక హోదా సాధించేంత వరకూ రాజీపడే ప్రసక్తి లేదని, ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాలు మోడీపై తిరుగుబాటు చేస్తున్నాయని గుర్తు చేశారు. మనం చేసే పోరాటాలు, ఆందోళనలు ప్రజలను చైతన్య పర్చేవిగా ఉండాలి తప్ప నష్టం చేకూర్చే విధంగా ఉంగడకూడదన్నారు. అయినా వామపక్ష పార్టీలు, హోదా సాధన సమితి మాత్రం తాము బంద్ చేస్తామని చెబుతున్నాయి. ఢిల్లీ వెళ్లి పోరాటం చేయడమంటే ఎలాగో వివరించాలని వారు ఎద్దేవా చేస్తున్నారు. ప్రజలకు కొంత నష్టం జరిగినా హోదా సాధనకు అవి భరించక తప్పదంటున్నారు. మొత్తం మీద బంద్ చేయవద్దని అధికార తెలుగుదేశం పార్టీ, చేస్తామని విపక్షాలు గట్టిగా చెబుతుండటంతో ఆరోజు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

బాబు అడ్డుకుంటే....

అలాగని చంద్రబాబు బంద్ ను పోలీసుల చేత విఫలం చేసే యత్నం చేసే సాహసం చేయకపోవచ్చు.ఇప్పటికే హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అంటూ గతంలో ప్రకటించి తిరిగి యూటర్న్ తీసుకున్న చంద్రబాబు మరోసారి అలాంటి తప్పిదం చేయకపోవచ్చంటున్నాయి వామపక్షాలు. తాము శాంతియుతంగానే బంద్ ను నిర్వహిస్తామని, పోలీసులను పెట్టి అణిచివేయాలనుకుంటే అందుకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు వామపక్ష నేతలు. ఈ బంద్ కు జనసేన కూడా మద్దతు ప్రకటించింది. వైసీపీ కూడా ఈ బంద్ కు మద్దతు ప్రకటించే అవకాశముంది.

Similar News