చంద్రబాబు ఛాన్స్ మిస్ చేసుకున్నారా?

ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి ఉంటే ప్రతి అంశంపై మాట్లాడే అవకాశం లభించేది. ఆయన ఆ అవకాశాన్ని జారవిడుచుకున్నారు

Update: 2022-09-21 03:18 GMT

చంద్రబాబు తప్పు చేశారు. అవును.. ఆయన రెండేళ్ల ముందే శాసనసభకు రానని శపథం చేశారు. దీనివల్ల ప్రజల్లో చంద్రబాబుకు ఏ మేర సింపతీ వచ్చిందో తెలియదు కాని, నష్టం మాత్రం తీవ్రంగానే జరిగింది. సభలో బలంగా వినిపించే అవకాశాన్ని ఆయన కోల్పోయినట్లయింది. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉంటే ఆయనకు ప్రతి అంశంపై మాట్లాడే అవకాశం లభించేది. ఆయన ఆ అవకాశాన్ని జారవిడుచుకున్నారని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. అసెంబ్లీలో లేని చంద్రబాబు గైర్హాజరు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు.

అనుభవమున్న నేత...
చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేత. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పదమూడేళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఆయన అన్ని అంశాలపై అవగాహన ఉంది. అసెంబ్లీలో జరిగే స్వల్ప కాలిక చర్చల్లో ప్రతి అంశంపై ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. తన అనుభవాన్ని జోడించి పాలకపక్షాన్ని ఇరుకున పెట్టే అవకాశముంది. ఆ అవకాశాన్ని చంద్రబాబు చేజేతులా చేజార్చుకున్నారు. తన భార్యను అవమానించిన సభలో తాను అడుగు పెట్టనని, తిరిగి సీఎం అయిన తర్వాతనే శాసనసభకు వస్తారని చెప్పి వెళ్లిపోయారు. శాసనసభలో తెలుగుదేశం పార్టీ సభ్యుల సంఖ్య తక్కువగా ఉంది. మాట్లాడగలిగే సభ్యులు ఒకరిద్దరు మినహా లేరు.
వైసీపీకి అడ్వాంటేజీగా...
వారిలో కూడా కొన్ని సబ్జెక్టులకే కొందరు పరిమితమవుతారు. సహజంగానే టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు అధికార సభ్యులు అడ్డుతగులుతుంటారు. వారిని సంయమనం కోల్పోయేలా చేస్తారు. సమయం వృధా అవుతుంది. వారికిచ్చిన సమయం మించిపోతుంది. ఇది పాలకపక్షానికి అడ్వాంటేజీగా మారుతుంది. అదే చంద్రబాబు ఉంటే ఆయన ప్రసంగానికి మధ్యలో అధికార పార్టీ సభ్యులు అడ్డుతగిలినా తాను చెప్పదలచుకుంది చెప్పేంత వరకూ వదలరు. స్పీకర్ స్థానంలో ఉన్న వారు సయితం ప్రతిపక్ష నేత కావడంతో కొంత ఎక్కువ సమయమే కేటాయిస్తారు. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో కనీసం చెప్పుకునే పరిస్థితి ఉండేది. కానీ నాలుగు రోజుల నుంచి కొనసాగుతున్న సభలో టీడీపీ సభ్యులు నినాదాలు మినహా మరేమీ చేయలేకపోతున్నారు. ఇచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. ఫలితంగా స్పీకర్ పోడియం వద్ద నిలుచుని నిరసన వ్యక్తం చేయాల్సి వస్తుంది. చివరకు సస్పెండ్ కు గురవుతున్నారు.
బాబు సభలో ఉంటే....
కానీ చంద్రబాబు సభలో ఉండి సస్పెండ్ అయితే అప్పుడు వచ్చే పబ్లిసిటీ వేరు. సింపతీ వేరు. వయసు, అనుభవం దృష్ట్యా ఆయనను సస్పెండ్ చేసేందుకు కూడా ప్రభుత్వం కొంత వెనకాడుతుంది. గతంలో జగన్ కూడా ఇదే శపథం చేసి బయటకు వెళ్లిపోయారు. కానీ అప్పుడు ఆయన ఒక్కడే కాదు. వైసీపీ సభ్యులందరూ వెళ్లిపోయారు. సభ ఏకపక్షంగా సాగడంతో అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి మైలేజీ దక్కలేదు. కానీ ఇప్పుడు టీడీపీ సభ్యులు సభకు హాజరవుతున్నారు. ఆ పార్టీపై అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు విరుచుకుపడుతున్నారు. అయినా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో టీడీపీ సభ్యులు చివరకు సస్పెండ్ అయ్యేందుకు నిరసన మార్గాన్ని ఎంచుకున్నారు. వర్షాకాల సమావేశాలు ఇప్పటి వరకూ నాలుగు రోజులు జరిగాయి. నాలుగు రోజులు టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఈరోజు చివరి రోజు. కానీ పార్టీకి అనుకున్న స్థాయిలో సానుభూతి రాలేదు. ఇంకా ఒకటిన్నరేళ్లలో అనేక సార్లు శాసనసభ సమావేశాలు జరగాల్సి ఉంది. అప్పుడూ ఇదే పరిస్థితి అని చెప్పక తప్పదు. మొత్తం మీద చంద్రబాబు సభకు రాకపోవడం ఆ పార్టీకి మైనస్ గా మారిందన్నది ఆ పార్టీ నేతలు అంగీకరిస్తున్న విషయం


Tags:    

Similar News