బాబును పొగిడే వారే లేరా?

Update: 2018-05-05 04:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తే వారే కరువయ్యారు. మూడు నెలల క్రితం వరకూ కేంద్రమంత్రులు ముఖ్యంగా ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వచ్చి చంద్రబాబు సమర్థతను, పరిపాలన అనుభవాన్ని చెప్పి వెళ్లిపోయేవారు. కేంద్రమంత్రుల రాకతో ఏపీలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల హడావిడి ఉండేది. కాని నెల నుంచి అది కానరావడం లేదు. బీజేపీతో వార్ మొదలెట్టాక ఏపీ వైపు ఎవరూ తొంగి చూడటం లేదు. ఇది చంద్రబాబుకు కొద్దిగా ఇబ్బందికర పరిణామమే.

తెలంగాణలో మాత్రం.....

పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేంద్రమంత్రుల రాక ఎక్కువగా ఉంటుంది. వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్న కేంద్రమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ వస్తున్నారు. హైదరాబాద్ లోని రామాంతపూర్ ఫ్లైఓవర్ శంకుస్థాపనకు ఆయన వచ్చారు. తెలంగాణలో కేంద్రమంత్రులు హల్ చల్ చేస్తుంటే ఏపీలో మాత్రం ఎటువంటి కార్యక్రమాలు లేక వెలవెల పోతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

పోలవరం పర్యటనకు....

నిజానికి పోలవరం ప్రాజెక్టును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సందర్శించాల్సి ఉంది. ఆయన అనేకసార్లు తేదీలు కూడా ప్రకటించారు. అయితే ఎన్డీఏతో తెలుగుదేశం బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏపీ వైపు ముఖం చూపించడం లేదు. పోలవరం ప్రాజెక్టును తానే నెలకొకసారి సందర్శిస్తానని చెప్పిన నితిన్ గడ్కరీ ఆ మాట మరిచి పోయినట్లుంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపైన కూడా ఆయన గతంలో ప్రశంసలు కురిపించారు. ఇక వెంకయ్య నాయుడు కూడా తెలంగాణలో పర్యటనలకే పరిమితమయ్యారు.

ఈ ఏడాది అంతా అంతేనా?

వచ్చే ఏడాది అంతా ఇక కేంద్ర మంత్రుల రాక ఏపీకి ఉండకపోవచ్చనే అంటున్నారు. పొరుగున ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ‌్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నా, బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నా తెలంగాణకు మాత్రం కేంద్రమంత్రుల రాక ఎక్కువగానే ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ కు వచ్చే సరికి అక్కడకు రావడానికి ఇష్టపడటం లేదు. మోడీపై చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేసినందుకే వారు రావటం లేదన్న ప్రచారమూ లేకపోలేదు. చంద్రబాబుతో వేదికను పంచుకోవడానికి కూడా వారు ఇష్టపడటం లేదని చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబుపై ప్రశంసలు కురిపించేవారి కోసం ఇప్పుడు ఆ పార్టీ వెతుకులాటలో ఉంది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను తీసుకొచ్చే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News