ప్రత్యేక హోదా ఉద్యమంలో వెనకబడ కూడదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దూకుడు పెంచారు. కలసి వచ్చే సంఘాలు, పార్టీలతో ఉద్యమించాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిర్వహించాలని ఆయన నిశ్చయించారు. ఎన్నికలకు ఇక ఏడాది మాత్రమే గడువు ఉండటంతో ఎన్నికలు ప్రారంభమయ్యే వరకూ ఉద్యమం ఏపీలో ఉండేలా చూసేందుకు ఆయన కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. మరోసారి రాజ్యాధికారాన్ని చేపట్టేందుకు ప్రత్యేక హోదా సెంటిమెంట్ ను బాగా వాడేసుకోవాలని భావిస్తున్నారు.
రెండు కమిటీలు....
ప్రధానంగా బీజేపీపై ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆగ్రహంతో కూడా ఉన్నారు. ఏపీ విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయడంపై ఏపీ ప్రజలు రగిలిపోతున్నారు. అందుకోసమే ఆయన ఏడాది వరకూ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నిర్వహించాలని పార్టీ శ్రేణులకు, అఖిలపక్షానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం చంద్రబాబు రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక కమిటీ అన్ని పక్షాలను సమన్వయం చేసుకుంటూ వెళుతుంటే మరో కమిటీ ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేస్తుంది.
అందరినీ కలుపుకుని.....
ప్రభుత్వం నుంచి ఉద్యమానికి పూర్తి సహకారం ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. ఉద్యోగ, విద్యార్థి, స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రత్యేక హోదా సాధన సమితి వంటి వారిని కలుపుకుని ఉద్యమాన్ని నిర్వహించనున్నారు. ఎలాగూ టీడీపీ శ్రేణులు ఉండనే ఉన్నాయి. అఖిల సంఘాలతో మరోసారి ఢిల్లీ వెళ్లి విభజన హామీలపై కేంద్రంపై వత్తిడి తేవాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు. హోదా ఉద్యమం ఎవరు చేసినా మద్దతివ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.
ఇంటికొకరు తప్పనిసరిగా.....
హోదా, విభజన హామీల అమలుకోసం ప్రతి ఇంటి నుంచి ఒకరు భాగస్వామ్యులయ్యేలా చూడాలని పార్టీ శ్రేణులతో పాటు అఖిల సంఘాలను కూడా కోరారు. అప్పుడే ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పారు. అయితే ఉద్యమ పంథా రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఉండేలా చూడాలన్నారు. ఇక్కడ ఆందోళనలు జరుగుతుంటే వచ్చే పరిశ్రమలు కూడా వెనక్కు వెళ్లే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకోసమే కమిటీ ఉద్యమపంథాను జాగ్రత్తగా రూపొందించాలని ఆయన సూచించారు.