ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయింది. మరో ఏడాదిలో లేదా అంతకన్నా ముందే ఎన్నికలు రానున్నాయి. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ విజయం సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీగానే వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకు అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ పార్టీకి అండగా ఉంటున్న ఓటు బ్యాంకుపై కన్నేశారు. వైసీపీకి ముందు నుంచీ ముస్లిం ఓటర్లు అండగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీచేయడంతో ముస్లిం ఓట్లు గంపగుత్తగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వేశారనే విశ్లేషణలు ఉన్నాయి. పైగా ముస్లింకు రిజర్వేషన్లు ఇచ్చింది దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అని కూడా వైసీపీకి వారు అండగా ఉంటున్నారు.
గతంలో అవకాశం ఉన్నా...
ఇదే సమయంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున ఒక్కరంటే ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచే ముస్లిం ఎమ్మెల్యేలు గెలుపొందారు. దీంతో, తన క్యాబినెట్ లో ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వలేదు చంద్రబాబు. వాస్తవానికి ఎమ్మెల్యేలు లేకున్నా మంత్రిని చేయాలనుకుంటే శాసనమండలి సభ్యుడిని చేసి చేయవచ్చు. కానీ, చంద్రబాబు ఆ విధంగా ఆలోచించలేదు. ఇక పార్టీ ఫిరాయింపుల సీజన్ లోనూ చంద్రబాబు మంత్రి పదవి హామీతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముస్లిం ఎమ్మెల్యేను పార్టీలోకి చేర్చుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే, గత ఏప్రిల్ లో మంత్రివర్గ విస్తరణ చేసినా, నలుగురు వైసీపీ ఫిరాయింపులు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టినా ముస్లింలకు మాత్రం ఇవ్వలేదు. ఆ సమయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, చాంద్ పాషా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నా వారి ఆశలు నెరవేరలేదు.
షరీఫ్ కి అవకాశం దొరికినట్లేనా..?
ఇక ప్రస్థుతం ఎన్నికలు సమీపిస్తున్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ ముస్లిం వర్గాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా కనపడుతోంది. ప్రభుత్వం నుంచి బీజేపీ తెగదెంపులు చేసుకోవడంతో ఖాళీ అయిన రెండు మంత్రి పదవుల్లో ఒకటి ముస్లిం వర్గానికి ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఎమ్మెల్సీగా ఉన్న ఎంఏ షరీఫ్ వైపు చూస్తున్నారని తెలిసింది. అయితే, రాయలసీమలో ముస్లింలు ఎక్కువగా ఉన్నందున కదిరి ఎమ్మెల్యే చాంద్ పాషాకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నా, ఎన్నికల ముందు ఫిరాయింపు ఎమ్మెల్యే మంత్రి పదవి ఇచ్చి మళ్లీ చర్చ లేవనెత్తడం అనవసరం అని ముఖ్యమంత్రి భావించవచ్చు. ఇక ఎలాగూ తన పార్టీ నుంచి గెలిచిన ముస్లిం ఎమ్మెల్యేలు లేనందున ఇస్తే ఎమ్మెల్సీలకు ఇవ్వాలి. నంద్యాలకు చెందిన ఫరూక్ ని ఇప్పటికే శాసనమండలి ఛైర్మన్ ను చేయడంతో ఇక మిగిలిన ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్ నే క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.