ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి దాదాపు అన్ని పార్టీలూ గైర్హాజరయ్యాయి. ఇక అఖిలపక్ష సమావేశం కాదని, ఏకపక్ష సమావేశమని విపక్షాలు విమర్శలు అప్పుడే ప్రారంభించాయి. చంద్రబాబు నాయుడు రెండోసారి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీలతో పాటు వివిధ ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు హాజరయ్యాయి. వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు గైర్హాజరయ్యాయి.
సీపీఐ, సీపీఎం....
గత సమావేశంలోనే సీపీఎం, సీపీఐ నేతలు చంద్రబాబును సమావేశంలోనే కడిగిపారేశారు. నాలుగేళ్లు నాన్చి ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమం చేయడంలో ఉద్దేశ్యమేంటని నిలదీశారు. తాము ప్రత్యేక హోదా అంటే కేసులు పెట్టి జైల్లో వేయించలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబుపై తమకు నమ్మకం లేదని, తమ ఉద్యమం తాము చేసుకుంటామని వామపక్ష పార్టీలు బయటకు వచ్చేశాయి. కాంగ్రెస్ మాత్రం కలసి నడుస్తామని, ఉద్యమానికి అండగా ఉంటామని చెప్పింది.
బీజేపీ ఘాటు లేఖ.....
అయితే అప్పటికీ ఇప్పటికీ పరిణామాలు మారిపోయాయంటున్నారు. చంద్రబాబు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లకుండా ఒక్కరే ఎందుకు వెళ్లారని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రశ్నిస్తున్నారు. హేమాహేమీలను కలసి వస్తారనుకుంటే, హేమమాలినిని కలిసి ఫొటో దిగి వచ్చారని రఘువీరా ఎద్దేవా చేశారు. చంద్రబాబు వల్ల ఉపయోగం లేదని రఘువీరా విమర్శించారు. ఇక బీజేపీ ఎప్పటిలాగానే అఖిలపక్షానికి రావట్లేదని చెప్పేసింది. అంతేకాదు బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు చంద్రబాబుకు ఘాటుగా లేఖ కూడా రాశారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు.
విద్యార్థి, ఉద్యోగ సంఘాలతో.....
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బాబు అఖిలపక్షంపై తీవ్ర విమర్శలు చేసింది. చంద్రబాబు పంపిన ఆహ్వానంలో ఆయన ఢిల్లీ టూర్ గురించి చెబుతారని తెలిపారని, ఢిల్లీ టూర్ విశేషాలు వారి ఎమ్మెల్యేలకు చెప్పుకోవచ్చని, తమను ఎందుకు పిలవాలని వైసీపీ అంటోంది. జనసేన సయితం ఈ అఖిలపక్షం టీలు తాగడానికి తప్ప వేస్ట్ అని తేల్చేసింది. దీంతో చంద్రబాబు అఖిలపక్ష సమావేశంలో పార్టీలకన్నా విద్యార్థి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులే ఎక్కువగా ఉండటం విశేషం.