విభజన హామీలపై ఏపీకి షాకిచ్చిన కేంద్రం

Update: 2018-07-04 08:15 GMT

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. విభజన చట్టంలోని హామీల అమలుపై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్ పై కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్ దీపేంద్ర కుమార్ అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇప్పటికే అమలు చేశామని, ఇక అమలు చేయాల్సినవి ఏమీ లేవని అఫిడవిట్ లో పేర్కొనడం సంచలనంగా మారింది. పొంగులేటి పిటీషన్ అసలు విచారనార్హం కాదని, దానిని కొట్టివేయాలని కోర్టుని కోరింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకే విభజన సమయంలో మన్మోహన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేకపోయామని స్పష్టం చేశారు.

ఇప్పటికే చాలా ఇచ్చాం...

ఇక దుగరాజపట్నం పోర్టుకు కేంద్ర క్యాబినెట్ అంగీకరించిందని, సాధ్యాసాధ్యాల అధ్యయనం తర్వాత పూర్తి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రానికి రూ.4,116 కోట్ల రెవెన్యూ లోటు మాత్రమే ఉందని, అందులో ఇప్పటికే రూ.3,979 కోట్లు ఇచ్చేశామని తేల్చిచెప్పారు. రాజధాని విషయంలో విభజన చట్టంలో చెప్పిన సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్, హైకోర్టు నిర్మాణం, ఇతర మౌళిక సదుయాపాల కల్పనకు ఇప్పటికే రూ.2,500 కోట్లు ఇచ్చామని, మిగతా రూ.వెయ్యి కోట్లు మూడెళ్ల పాటు ఇస్తామని స్పష్టం చేసింది ఆర్థిక శాఖ. పోలవరానికి సంభందించి ఏప్రిల్ 1, 2014 నుంచి అయ్యే ఖర్చులు మాత్రమే వంద శాతం ఇస్తామని తెలిపింది.

Similar News