బుగ్గనపై అనర్హత వేటు వేస్తే....?

Update: 2018-06-17 04:04 GMT

పీఏసీ ఛైర్మన్ గా ఉండి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రభుత్వ సమాచారాన్ని ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకుంది. బుగ్గన కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని టీడీపీ చెబుతోంది. అవసరమైతే బుగ్గనపై అనర్హత వేటు కూడా వేయవచ్చని సాక్షాత్తూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెబుతున్నారు. ఇటీవల బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో కలసి ప్రభుత్వ కారులో ఏపీ భవన్ నుంచి రామ్ మాధవ్ ఇంటికి వెళ్లారన్నది టీడీపీ ఆరోపణ. పీఏసీ ఛైర్మన్ గా ఉండి బుగ్గన ప్రభుత్వ పత్రాలను ఇవ్వడం సరికాదని చెబుతోంది. అందుకే ఆయనపై అనర్హత వేటు విషయం పరిశీలిస్తామని అంటోంది.

అంతా అబద్ధం.....

అయితే తాము ఎటువంటి రహస్య పత్రాలను రామ్ మాధవ్ కు ఇవ్వలేదని, తాము అసలు రామ్ మాధవ్ ఇంటికే వెళ్లలేదని, లాగ్ బుక్ లో ఒకలాగా ఉంటే, దానని ట్యాంపరింగ్ చేసి టీడీపీ నేతలు దుష్ప్రచారానికి దిగుతున్నారనిి వైసీపీ నేతలు చెబుతున్నారు. తాను ప్రభుత్వ పత్రాలను ఇవ్వదలచుకుంటే నేరుగా ఇక్కడే ఇస్తానని, ఢిల్లీ వెళ్లి ఇవ్వాల్సిన అవసరం లేదని వైసీపీనేత, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అంటున్నారు. టీడీపీ తాటాకు చప్పుళ్లకు తాము బెదిరేది లేదంటున్నారు.

ఎమ్మెల్యేల మాటేమిటి?

అలాగే అనర్హత వేటు విషయానికొస్తే పార్టీ మారిన 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల మాటేమని కూడా సూటిగా ప్రశ్నిస్తోంది. ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడిచి తమ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను పార్టీలో చేర్చుకున్నారని, అనర్హత వేటు అంశం ఏపీ స్పీకర్ పరిధిలో ఉన్నా ఇంతవరకూ చర్చలు ఎందుకు తీసుకోలేదని వైసీపీ నిలదీస్తుంది. ముందు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు గురించి యనమల ఆలోచించాలని, తర్వాత బుగ్గన విషయం చూసుకోవచ్చని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మొత్తం మీద బుగ్గన, ఆకుల వ్యవహారం ఇప్పట్లో సమసిపోయేలా లేదు.

Similar News