బ్రేకింగ్ : కర్ణాటక కమలానిదే

Update: 2018-05-15 06:25 GMT

హంగ్ లేదు...ఏమీ లేదు. కమలం పార్టీ కర్ణాటకలో స్పష్టమైన మెజారిటీ సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. దాదాపు 120 స్థానాలను సొంతంగా బీజేపీ కైవసం చేసుకునే వీలుందన్నది విశ్లేషకుల అంచనా. ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలను తలకిందులు చేస్తూ మోడీ చివరి నిమిషంలో కర్ణాటక ఫలితాలను తిప్పేశారు. ఇప్పటి వరకూ అందుతున్న ఫలితాల ప్రకారం 222 నియోజకవర్గాల్లో కౌంటింగ్ జరుగుతుంటే బీజేపీ అభ్యర్థులు 112 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ కేవలం 67 స్థానాలకే పరిమితమయింది. ఇక జనతాదళ్ ఎస్ 41 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఇతరులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

120 స్థానాలు ఖచ్చితంగా.....

బూత్ మేనేజ్ మెంట్, ఎలక్షనీరింగ్ చేయడంలో బీజేపీకి మరెవరూ సాటిరారన్నది మరోసారి కర్ణాటక ఫలితాలతో వెల్లడయంది. నిబద్దత కలిగిన కార్యకర్తలు, సంఘ్ పరివార్ అవిరళ కృషి, మోడీ మ్యాజిక్ లు కన్నడనాట కమలాన్ని వికసింప చేశాయనే చెప్పొచ్చు. మోడీ, అమిత్ షాలు తొలినుంచి చెబుతున్నట్లుగానే ఫలితాలు రావడం విశేషం. గత పార్లమెంటు సమావేశాల్లో మోడీ కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగు కాక తప్పదని చెప్పారు కూడా. అలాగే అమిత్ షా తమకు 130 స్థానాలు దక్కుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. వీరిద్దరూ అన్నట్లుగానే ఇప్పుడు కర్ణాటకలో కమలం పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి 120 స్థానాలకు చేరుకునే అవకాశముందని చెప్పకతప్పదు.

నాలుగు ప్రాంతాల్లోనూ.....

కర్ణాటకలో నాలుగు ప్రాంతాల్లో బీజేపీ తన సత్తాను చాటడం విశేషం. ముంబై కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక, కోస్తా కర్ణాటక, సెంట్రల్ కర్ణాటకలో బీజేపీ విజయభేరి మోగించింది. బెంగుళూరు సిటీలోనూ బీజేపీ కొంత దూకుడుగానే ఉంది. దక్షిణ కర్ణాటకలో అయితే జనతాదళ్ ఎస్ జోరుమీదుంది. ఇప్పుడు ఆధిక్యంలో కొనసాగుతున్న 112 స్థానాలతో పాటు మరో పది నుంచి పదిహేను స్థానాలను కైవసం చేసుకుని సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు బీజేపీ సిద్ధమవుతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Similar News