బ్రేకింగ్ : కాంగ్రెస్ గెలిచింది....యడ్డీ ఓడారు.....!

Update: 2018-05-19 10:41 GMT

ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేశారు. బలపరీక్ష అవసరం లేకుండానే ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆయన పదిహేను నిమిషాలు ఉద్విగ్నంగా ప్రసంగించి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. దీంతో సభ వాయిదా పడింది. కర్ణాటక రాష్ట్రంలో అతిపెద్ద మెజారిటీగా ఆవిర్భవించిన బీజేపీ బలపరీక్ష జరగకుండానే ఓటమి పాలయింది. యడ్యూరప్ప రాజీనామా చేయడంతో ఆయన మూడు రోజుల ముఖ్యమంత్రిగానే మిగిలారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 104 స్థానాల్లో బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ 78, జనతాదళ్ ఎస్ 38 స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్రులు రెండు చోట్ల గెలిచారు. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. అయితే గవర్నర్ వాజూభాయి వాలా అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి చెందిన నేత యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. యడ్యూరప్ప ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ బలపరీక్షకు పదిహేను రోజులు గడువు ఇచ్చారు.

ఉదయం నుంచి హైడ్రామా....

కాని గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, జేడీఎస్ లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఇరవై నాలుగు గంటల్లోగా బలాన్ని నిరూపించుకోవాలని తీర్పు చెప్పింది. ఈ మేరకు గవర్నర్ ఈరోజు కర్ణాటక శాసనసభను సమావేశ పర్చారు. అయితే తమకు 120 మంది సభ్యుల మద్దతుందని తొలి నుంచి యడ్యూరప్ప చెబుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన లింగాయత్ వర్గం ఎమ్మెల్యేలు తనకు అండగా నిలుస్తారని భావించారు. అలాగే గాలి సోదరుల బేరసారాలు కలసి వస్తాయని ఆశించారు. కాని చివరకు యడ్యూరప్పకు తగినంత బలం సమకూరలేదు. కాంగ్రెస్, జేడీఎస్ లు తమ ఎమ్మెల్యేలను కంటికి రెప్పలా కాపాడుకోవడంతో యడ్యూరప్పకు ఓటమిని అంగీకరించక తప్పలేదు. యడ్యూరప్ప, గాలి జనార్థన్ రెడ్డి తమ సభ్యులను ప్రలోభాలకు గురిచేసిన ఆడియో టేపులను విడుదల చేసి బీజేపీని ఎక్కడికక్కడ కట్టడి చేసింది. శాసనసభ ప్రారంభమైన ఉదయం 11 గంటల నుంచే హైడ్రామా నడిచింది. బీజేపీ వైపు పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ప్రచారం జరిగింది. దీంతో కాంగ్రెైస్ కొంత కలవరానికి గురయినప్పటికీ చివరికి తన సభ్యులను కాపాడుకోగలిగింది. మొత్తం మీద కన్నడ నాట కమలం పార్టీకి ఘోర పరాజయం తప్పలేదు.

Similar News