ఏందబ్బా ఈ గ్లామర్ రహస్యం... ఏం తాగుతున్నారో?

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇద్దరూ అరవై ఏళ్లు దాటిన వారే. అయినా యంగ్ హీరోలతో పోటీపడుతున్నారు

Update: 2023-01-31 06:25 GMT

ఒకరికి అరవై ఐదుకు పాగానే.. మరొకరికి అరవై రెండుకు మించి. అయినా.. వారు యువ హీరోల మాదిరిగా కలెక్షన్లు వసూలు చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై తమకు ఎదురు లేదన్నట్లుగా అరవై వడిలోనూ బాక్సాఫీసులను బద్దలు కొడుతున్నారు. ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా, మరొకరు నందమూరి బాలకృష్ణ. ఇద్దరూ కాస్త అటు.. ఇటుగానే సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన వారే. నందమూరి బాలకృష్ణకు తండ్రి ఎన్టీఆర్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. కానీ చిరంజీవికి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే టాలివుడ్ బాప్ గా మారారు.

యంగ్ హీరోలకు...
ఇప్పటికీ ఇద్దరు హీరోలు యంగ్ హీరోలకు పోటీపడుతున్నారు. వారి సైన్ల కోసం నిర్మాతలు నేటికీ క్యూ కడుతున్నారు. ఇక ఒక్కసారి వారితో సినిమా చేస్తే చాలు తమ జన్మ ధన్యమవుతుందని దర్శకులూ భావిస్తున్నారు. యువతరం దర్శకులు వీరి సినిమాలు చేయడానికి ఉవ్విళ్లూరుతుంటారు. ఇప్పటికీ క్రేజ్ తగ్గిన హీరోలు వారే. ఫ్యాన్స్ పరంగా, కలెక్షన్ల పరంగా ఇద్దరూ జమజట్టీలే. ఒకరికి ఒకరు పోటీగా సినిమాలు చేస్తుంటారు. సినిమా ఫెయిలయితే నేటి తరం హీరోల్లా కుంగిపోరు. కసి పెరిగి తర్వాత సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసేంత వరకూ నిద్రపోరు. ఎలాంటి క్యారెక్టర్ లోనూ ఇట్టే ఒదిగిపోయే చిరంజీవి, బాలకృష్ణలు ఇరవై దశకంలోనూ టాప్ హీరోలే.

నేర్చుకోవాల్సింది....
వారిని చూసి యంగ్ హీరోలు ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందంటారు నిర్మాతలు, దర్శకులు. టైమ్ కు సెట్ లోకి రావడం కాని, అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమా పూర్తి చేయడం కాని, సినిమా ప్రమోషన్లలో అలసట లేకుండా పాల్గొనడం... నిర్మాతలకు నష్టమొచ్చినా ఆదుకోవడం.. ఒక్కటేంటి.. ఎన్నో రకమైన క్వాలిటీస్... అవన్నీ నేటి తరం హీరోల్లో చాలా తక్కువగా చూడవచ్చంటున్నారు. అలాంటి చిరంజీవి, బాలకృష్ణ నేటికీ యంగ్ గా కనపడటానికి కారణాలేంటి? అమృతం తాగారా? దిష్టి తగులుతుందేమో.. ఇంతకంటే ఎక్కువగా చెప్పలేం కాని.... చిరంజీవి పేరుకు తగ్గట్టే ఉంటారు. ఇక బాల కృష్ణ .. ఇంకా బాలుడే. అలాంటి ఇద్దరు హీరోలు క్రేజ్ తగ్గలేదు. గ్లామర్ చెదిరి పోలేదు.
అరవై ఏళ్లు దాటినా..?
అదే దూకుడు.. అదే స్పీడ్.. డైలాగ్ లో అదే మాడ్యులేషన్. అరవై ఏళ్లు దాటినా గొంతులోనూ, ఆహార్యంలోనూ ఎలాంటి మార్పు లేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇద్దరు హీరోలు దశాబ్దకాలం క్రితం ఎలా ఉన్నారో.. ఇప్పుడూ అదే తరహాలో ఉన్నారు. చిరంజీవి, బాలకృష్ణలు ఆరోగ్యపరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు... జీవితంలో క్రమశిక్షణ, ఆహారపు అలవాట్లు ఇద్దరినీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హీరోలుగానే ఉంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల సంక్రాంతికి విడుదలయిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి మూవీలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

రాజకీయాల్లోనూ...
ఇద్దరూ సినిమా రంగంలో రాణించారు. రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. చిరంజీవి ఎమ్మెల్యే అయి రాజ్యసభ పదవి చేపట్టి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. బాలయ్య బాబు హిందూపురం ఎమ్మెల్యేగా దశాబ్దకాలంగా కొనసాగుతున్నారు. ఇద్దరూ ప్రజాసేవ చేస్తూ మంచి పేరే సంపాదించారు. చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకోగా, బాలకృష్ణ మాత్రం తన తండ్రి స్థాపించిన టీడీపీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే చిరంజీవి నాన్ కాంట్రవర్సీ కాగా, బాలయ్య చిన్న పిల్లల మనస్తత్వం. అప్పుడప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారుతుంటాయి. మొత్తం మీద మెగా హీరో, నటసింహం తెలుగు ఇండ్రస్ట్రీని అరవై పదుల వయసులోనూ ఏలుతుండటం రికార్డు బ్రేక్ అని చెప్పాలి. ఇద్దరూ మరికొంత కాలం వెండి తెరను ఏలాలని ఆశిద్దాం.


Tags:    

Similar News