బీజేపీ ఏమాత్రం తగ్గేట్లు లేదే?

Update: 2018-04-08 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీల మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలోనే ఫ్లెక్సీల వార్ కూడా ప్రారంభమైంది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ మోసం చేశారంటూ టీడీపీ మాటల యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా బీజేపీ నేతలు కూడా రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని బయటపెట్టారు. పోలవరం, పట్టిసీమల్లో జరిగిన అవినీతిని ప్రశ్నించారు. కాగ్ తెలిపిన అభ్యంతరాలను, బయటపెట్టిన లొసుగులను కూడా బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

బెజవాడలో టీడీపీ ఫ్లెక్సీలు.....

ఈ పరిస్థితుల్లో టీడీపీ నేతలు విజయవాడలో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పెద్దయెత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. విజయవాడ అర్బన్ తెలుగుదేశం నేత కాట్రగడ్డ బాబు నేతృత్వంలో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రధాని నిలువునా ఏపీని ముంచాడని, ఏపీ ద్రోహి అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీని అవమానపరుస్తూ పెట్టిన ఫ్లెక్సీలను తొలగించాని బీజేపీ నేతలు కోరారు.

గుంటూరులో బీజేపీ ఫ్లెక్సీలు....

ఇదిలా ఉండగానే బీజేపీ నేతలు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపింది. విజయవాడ పక్కనే ఉన్న గుంటూరు పట్టణంలో వెలిసిన బీజేపీ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణకు చెందిన నియోజకవర్గంలోనే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఫ్లెక్సీలపై మోడీ, అమిత్ షా ఫొటోలతో ...ఒక్క మాట అడుగుతున్నా.... అభివృద్ధి పేరుతో చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఆత్మగౌరవం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ వెలసిన ఈ ఫ్లెక్సీలపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Similar News