టీడీపీకి బీజేపీ ఓపెన్ ఆఫర్

Update: 2018-04-19 06:30 GMT

నిన్నటి దాకా మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మనసు మార్చుకోవాలని సూచించింది. తిరిగి తమ జట్టులో చేరతామంటే తాము స్వాగతిస్తామని ఓపెన్ ఆఫర్ ఇస్తామని ప్రకటించింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మిత్రులుగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అందుకే ఏపీలో గెలుపు సాధ్యమయిందంటున్నారు కమలనాధులు. మోడీ ఇమేజ్ వల్లనే చంద్రబాబు గెలిచారని ఇప్పటికీ చెబుతుంటారు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా కమలనాధులు రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోగలిగారు. అలాగే నలుగురు ఎమ్మెల్యేలు కాగలిగారు.

ఒంటరిగా ఇద్దరూ దిగితే.....

కాగా ఏపీ విభజన హామీలు అమలు చేయడం లేదని, కేంద్రం తీరుకు నిరసనగా బీజేపీకి కటీఫ్ చెప్పిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రివర్గం నుంచే కాకుండా ఎన్డీఏ నుంచి కూడా టీడీపీ బయటకు వచ్చి మాటల యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు ఒంటరిగానే బరిలోకి దిగే పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీతో జట్టుకట్టేందుకు ఏపీలో ఏ పార్టీ సుముఖంగా లేదు. అలాగే ఏపీకి అన్యాయం చేసిన బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితులను గమనించి బీజేపీ నేతలు టీడీపీకి ఒపెన్ ఆఫర్ ఇచ్చారు.

తిరిగి వస్తే....

బీజేపీతో తిరిగి మైత్రికి సిద్ధమయితే తాము స్వాగతిస్తామని నరసాపురం పార్లమెంటు సభ్యుడు గోకరాజు గంగరాజు ప్రకటించారు. రెండు పార్టీలూ కలసి ఉంటేనే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. సైద్ధాంతపరంగా టీడీపీ, బీజేపీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. రాష్ట్రానికి నిధులు కేటాయించే విషయంలో ఇప్పటికీ కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. హోదా వలన కలిగే ప్రయోజనాలన్నింటినీ ప్యాకేజీ రూపంలో రాష్ట్రానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. సో..టీడీపీ పునరాలోచించుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు.

Similar News