ఆ...దొంగలు దొరికారు....!

Update: 2018-07-14 03:15 GMT

జైభవానీ జ్యూవెలర్స్ లో దోపిడీకి పాల్పడిన దొంగలు ఎట్టకేలకు చిక్కారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సైబరాబాద్.. సంగారెడ్డిజిల్లా పోలీసులు పోటీపడి మరీ కేసును ఓకొలిక్కి తీసుకువచ్చారు. పదిరోజుల్లో నిందితులను కర్నాటకలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను పక్కదారి పట్టించేందుకే వేషం మార్చి మరీ దోపిడీ చేసినట్లు గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నగలషాపు దోపిడీ కేసు ఓ కొలిక్కి వచ్చింది. నకిలీ రివాల్వర్ చూపించి నగల దుకాణదారున్ని బెదిరించి దోపిడీకి పాల్పడిన ముఠాను పోలీసులు పట్టేశారు. ఘటన జరిగిన తర్వాత కేసును సవాల్‌గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు బృందాలుగా ఏర్పడి పదిరోజుల్లోనే దొంగలను పట్టుకున్నారు. కోల్‌కతా నగరానికి సమీపంలో ఉన్న ప్రాంతంలో తలదాచుకున్న వారిని అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

బెదిరించి..కళ్లల్లో కారం కొట్టి.....

హైదరాబాద్‌ శివారు సమీపంలోని అమీన్‌పూర్‌ మండలం బీరంగూడలో ఉన్న శ్రీజైభవానీ జువెలర్స్‌లో ఈనెల 3న రాత్రి పది గంటలు దాటాక ఇక్కడ పనిచేసే జయరాం అనే వ్యక్తి నగలను లాకరులో భద్రపరిచేందుకు వెళ్లారు. చాలా సమయం నుంచి వేచిచూస్తున్న ఇద్దరు అగంతకులు వెంటనే గదిలోకి వెళ్లి జయరాంను బెదిరించారు. ఎదురు తిరిగిన అతని కళ్లలో కారం చల్లి కిలోన్నరకు పైగా బంగారం, 5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. దోపిడీ విషయం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకోవాలని నిశ్చయించుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడ్డారు. జిల్లా పోలీసు అధికారులతోపాటు మాదాపూర్‌కు చెందిన స్పెషల్‌ ఆపరేషన్‌ బృందాలు కోల్‌కతాకు వెళ్లారు.

సీసీ ఫుటేజ్ ద్వారా....

ఘటన స్థలంలో దొరికిన సిసి ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు అందులో ఓ వ్యక్తితో పాటు బుర్కాలో మరో మహిళ సహకరించినట్లు గుర్తించారు. దీంతో పాటు వారు వెళ్లున్న బైక్ పై దృశ్యాలు కూడా సిసి కెమేరాల్లో రికార్డు కావడం, వారు కర్నాటక వైపు వెళ్లినట్లు ఓ నిర్థారణకు వచ్చారు. సిటీకి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో బురఖా ధరించి దోపిడీకి సహకరించిన మహిళతోపాటు మరో ఇద్దరు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వారికి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తినీ పట్టుకున్నారు. ఎత్తుకెళ్లిన నగదు, బంగారాన్నీ స్వాధీనం చేసేందుకు వీలుగా విచారణ చేపడుతున్నారు. వీరిని కోల్‌కతా నుంచి సంగారెడ్డి జిల్లాకుతరలించారు.

పోలీసులను తప్పు దోవ పట్టించాలని....

అయితే పట్టుబడ్డ నిందితులను పోలీసులు విచారిస్తే అసలు విషయం విని కంగుతిన్నారు. దోపిడీ చేసింది ఓ వర్గానికి చెందిన వారు కాదని, హిందువులే అని తెలిసింది. పోలీసులను తప్పుదారి పట్టించాలని బుర్కా వేసుకున్నట్లు తేలింది. అంతే కాదు దోపిడీ చేసిన నిందితుల్లో ఒకరు సాఫ్ట్ వేర్ ఉద్యోగి. తమ బంధువుల్లో ఒకరికి ఆరోగ్యం బాగోలేక పోతే డబ్బుల కోసం ఈదోపిడీ చేసినట్లు తేలింది. కోర్టులో హాజరు పరిచిన తరువాతే నిందితుల వివరాలు వెల్లడించాలని పోలీసులు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే దుండగులను తాము పట్టుకున్నామంటే తాము అంటూ సంగారెడ్డి పోలీసులు, ఎస్ఒటి పోలీసులు ఎవరికి వారు క్రెడిట్ తమ అకౌంట్లో వేసుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి మధ్య క్రెడిట్ వార్ పోలీసు ఉన్నతాధికారులకు ఓ తలనొప్పిగా మారింది.

Similar News