ఉత్తరాంధ్ర సమస్యలపై తెలుగుదేశం పార్టీలు కేంద్ర మంత్రులతో భేటీ రసాభాసాగా మారింది. బీజేపీ నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. దీంతో టీడీపీ నేతలు రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగాల్సి వచ్చింది. ఉత్తరాంధ్ర సమస్యలపై టీడీపీకి చెందిన ఉత్తరాంధ్ర నేతలు ఢిల్లీకి వెళ్లారు. విశాఖ రైల్వే జోన్ తో పాటు వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి నిధులపై వివిధ శాఖల మంత్రులతో చర్చించాలనుకున్నారు.
రెండేళ్లయినా పట్టొచ్చు.......
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ తో భేటీకి అపాయింట్ మెంట్ కోరారు. దాదాపు రెండున్నర గంటలు వేచి ఉన్నాక పియూష్ గోయల్ వారిని కలుసుకునేందుకు అనుమతిచ్చారు. ఈ సమావేశంలో విశాఖ ఎంపీ హరిబాబుతో పాటు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా ఉన్నారు. టీడీపీ తరుపున మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యులు ఎంపీలు పాల్గొన్నారు. విశాఖ రైల్వే జోన్ ఎప్పుడు ఇస్తారని వారు పియూష్ గోయల్ ను కోరారు. పార్లమెంటులో హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించారని, దానికి ఎంత సమయం పడుతుందో చెప్పాలని పియూష్ గోయల్ ను టీడీపీ నేతలు కోరారు.
సెంటిమెంట్ అంటూ.....
అయితే పియూష్ గోయల్ మాత్రం ఇందుకు స్పష్టమైన సమాధానమివ్వలేదు. రైల్వే జోన్ ఏర్పాటుపై అధ్యయనం జరుగుతుందని, వివిధ వర్గాల వారితో చర్చిస్తున్నామని, నెల పట్టొచ్చని, రెండేళ్లయినా పట్టొచ్చని పియూష్ గోయల్ సమాధానం ఇవ్వడంతో టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీకి విశాఖ రైల్వే జోన్ ఒక సెంటిమెంట్ అని దానిని నీరుగార్చవద్దని కోరారు. రైల్వే జోన్ ఇవ్వకుంటే తెలంగాణ మాదిరిగా ఆత్మహత్యలు చోటు చేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
జీవీఎల్ వ్యాఖ్యలపై....
అలాగే వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులపై కూడా చర్చ జరిగింది. ఇచ్చిన రూ. 350 కోట్లు ఎందుకు కేంద్రం వెనక్కు తీసుకుందని ప్రశ్నించారు. అక్కడే ఉన్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చిన నిధులను సక్రమంగా వినియోగించలేదని, అందుకే వెనక్కు తీసుకోవాల్సి వచ్చిందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలుగుదేశం నేతలకు, జీవీఎల్ కు వాగ్వాదం జరిగింది. అసలు జీవీఎల్ ఎవరని? టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు ప్రశ్నించారు. యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీకు ఏపీతో సంబంధం ఏంటని? అలా అయితే ఆంధ్రాలో తిరగనివ్వరని కళా ధ్వజమెత్తారు. "అసలు నువ్వెవరవి" అంటూ జీవీఎల్ ఎదురు దాడికి దిగారు. మంత్రి సుజనా చౌదరి జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఆంధ్రప్రదేశ్ కు నిధులు కేటాయింపు విషయంలో టీడీపీ నేతలు అబద్ధాలాడుతున్నారని జీవీఎల్ మరోసారి అనగా టీడీపీ నేతలు జీవీఎల్ పై మండిపడ్డారు. మంత్రి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో టీడీపీ నేతలు మంత్రి పియూష్ గోయల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. పియూష్ మాటలను బట్టి రైల్వే జోన్ సమస్యను కేంద్రం ఇప్పట్లో పరిష్కరించేలా కన్పించడం లేదు.