క్రీడల్లో వుండే రాజకీయాలు ఎందులోనూ వుండవు మనదేశం లో అంటారు. ఆ మాట ను మరోసారి నిజం చేస్తూ అమరావతి కేంద్రంగానే అంతర్జాతీయ, జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి పోరాటం ప్రారంభించింది. విలువిద్యలో అత్యుత్తమ స్థాయిలో రాణించి అర్జున అవార్డు అందుకున్న జ్యోతి సురేఖ ఇప్పుడు న్యాయం కోసం రోడ్డెక్కింది. తనకు ఎలాంటి కోచింగ్ ఇవ్వని వ్యక్తి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి మోసం చేశారని ఆరోపించింది జ్యోతి సురేఖ. దేవుడు కరుణించినా పూజారి దయాలేనట్లు ప్రభుత్వం తనకు కోటిరూపాయల నజరానా ప్రకటిస్తే తనకు కోచ్ అని ప్రచారం చేసుకున్న చెరుకూరి సత్యనారాయణ 22 లక్షల రూపాయలు తగ్గించి ఇచ్చారని ఆరోపించింది.
ఏపీనుంచి ఆడనీయడమే లేదు ....
క్రీడలకు ప్రాధాన్యత అని క్రీడాకారులకు నజరానాలు అని చెప్పేవన్నీ ప్రకటనలకే పరిమితమా ? జ్యోతి సురేఖ చేస్తున్న విమర్శలు ఆరోపణలు చూస్తే నిజమనే అనిపిస్తుంది. దేశ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడా కుసుమం జ్యోతి కి ఎపి నుంచి ప్రాతినిధ్యమే లేకుండా రాజకీయం సాగుతుందని స్వయంగా ఆమె ఆరోపించింది. రాష్ట్రం నుంచి ఆడే అవకాశమే లేకపోవడం తో పెట్రోలియం బోర్డు నుంచి ప్రాతినిధ్యం వహించాలిసి వస్తుంది అని వాపోయింది యువ క్రీడాకారిణి. తనకు ఎలాంటి కోచింగ్ ఇవ్వకుండా అంతా నా ప్రతిభే అని చెప్పుకుంటున్న సత్యనారాయణ వంటివారి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని జ్యోతి చెప్పుకొచ్చింది. మరి సంచలనం గా మారిన ఈ వ్యవహారంపై సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.